విసిగిపోయి... పదవి వదిలేస్తానంటున్నాడు

May 28, 2020

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన పదవి మీద కన్నేసిన వారంతా పండుగ చేసుకునే మాటను చెప్పేశారు. పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన్ను పదవి నుంచి దించేసి.. ఆ పదవిని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్న వారు భారీగానే ఉన్నారు. చేతిలో అధికారం లేకున్నా.. పార్టీలో పంచాయితీలకు కొదవ లేదన్నట్లుగా పీసీసీ చీఫ్ పోస్టు కోసం తెలంగాణ కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నెలకొని ఉంది.
త్వరలో జరగనున్న మున్సిపోల్స్ ఎన్నికల సన్నాహాక సమావేశం సూర్యాపేట జిల్లా హూజూర్ నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ నోట సంచలన వ్యాఖ్య ఒకటి బయటకు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపోల్స్ అనంతరం తాను పీసీసీ అధ్యక్ష పదవిని వదిలేస్తానని.. పీసీసీ చీఫ్ పదవి నుంచి తనను తీసేయటం కాదు.. తానే వదిలేస్తానని స్పష్టం చేశారు. హుజూర్ నగర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని అభయమిచ్చారు.
మొత్తానికి కొత్త సంవత్సరం వేళ.. తన పదవి మీద ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మాట ఉత్తమ్ నోటి నుంచి వచ్చిందని చెప్పాలి. ఇంతకాలం ఉత్తమ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు అంతగా కలిసి రాని వారంతా.. ఇప్పుడు జరిగే మున్సిపోల్స్ లో అయినా కలుస్తారా? సమిష్టిగా పని చేసి పాజిటివ్ ఫలితాల్ని సొంతం చేసుకుంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.