2020 మరిచిపోండి... వ్యాక్సిన్ రాదు

August 05, 2020

ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అని ఐసీఎంఆర్ చేసిన ప్రకటన నవ్వుల పాలయ్యింది. క్లినికల్ టెస్టులకు గుర్తించిన సంస్థలు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇంత బాధ్యతా రహితంగా ఎలా ప్రకటిస్తారు. అది ఎన్నో దశలు దాటాలి. ఒత్తిడితో చేసే పనికాదు అంటూ అందరూ విమర్శించారు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే,  ఎట్టి పరిస్థితుల్లోను పంద్రాగస్టుకు వ్యాక్సిన్ చేయటం సాధ్యం కాదని  సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టంచేశారు. ఇపుడు ప్లాన్ చేసినట్లు మనం ఊహించిన ఫలితాలు వచ్చినా... అంటే అన్నీ అనుకున్నట్లు జరిగినా కూడా వచ్చే ఏడాది తొలినాళ్లలో వ్యాక్సిన్ వచ్చే వీలుందని చెప్పారు. 

ఒక వ్యాక్సిన్ తేవడం చిన్న విషయం కాదు. వ్యాక్సిన్ మార్కెట్లోకి తేవటానికి ముందు భారీ స్థాయిలో క్లినికల్ టెస్టులు జరగాల్సి ఉందన్నారు. ఇదేమీ మందు కాదు మింగేసి టెస్టు ఏమైందో తెలుసుకోవడానికి.. అని నిపుణులు చెబుతున్న వాదనను ఆయన సమర్థించారు.

వ్యాక్సిన్ వివిధ ప్రక్రియల్లో జరగాల్సిన వేళ, వ్యాక్సిన్ అనేది వంద శాతం సత్ఫలితాలు ఇవ్వాల్సిన వ్యవహారం కాబట్టి ఒక మందు కనిపెట్టినంత సులువు కాదు వ్యాక్సిన్ అన్నారు. అసలు ఇందులో హడావుడి పడటమే అనవసరం అన్నారు.

కీలకమైన క్లీనికల్ ట్రయల్స్ జరగకుండానే, వాటి ఫలితాలు చూడకుండానే డేట్ ఫిక్స్ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అంతే కాదు, ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సమాజంలో మనల్ని చులకన చేస్తాయన్నారు.
మామూలుగా  ఒక వ్యాక్సిన్ తయారుచేయటానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగంగా వ్యాక్సిన్ రూపొందించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు.2020లో వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకోవద్దని ఆయన ఖరాఖండిగా చెప్పడం సంచలనం అవుతోంది.