వంశీ... జగన్ ను కలిశాడేంటి?

July 15, 2019

వల్లభనేని వంశీ. ఎన్నికల ముందు... కేసీఆర్ బెదిరింపులను మీడియా ముందుకు తెచ్చి టీఆర్ఎస్ జగన్ బంధాన్ని బయటపెట్టిన తెలుగుదేశం నేత. ఛాలెంజ్ చేసి మరీ గన్న వరం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఎన్నికల ముందు రాజకీయాలు.. ఎన్నికలయ్యాక ప్రజలు అన్న సిద్ధాంతంతో ఈరోజు వంశీ జగన్ ను కలిశారు. గన్నవరం ప్రజల ప్రతినిధిగా... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ రైతుల సమస్యలపై జగన్ కు కొన్ని వినతులు ఇచ్చారు. అయితే, ఆయన ఇప్పటికే వీటిపై లేఖ రాసిన విషయం తెలిసిందే.
తాజాగా ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా వంశీ కొన్ని విజ్ఞప్తులను జగన్ ముందుంచారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్ సరఫరా చేయాలన్నది అందులో ప్రధానమైనది. తాను సొంత ఖర్చులతో 500 మోటార్లను రైతులకు పెట్టించాను అని... వాటిని ప్రభుత్వం పరం చేయడానికి తాను సిద్ధమని జగన్ కు వంశీ వివరించారు. రైతుల కోసం గోదావరి నీటిని రైతుల పొలాలకు తరలించి పంటలు కాపాడాలని ముఖ్యమంత్రిని కోరారు. నాలుగు సంవత్సరాలుగా తాను రైతులకు ఈ విషయంలా అండగా ఉన్నానని... ఈ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించడానికి సహకరించాలని వంశీ కోరారు. రైతుల విషయం కావడంతో జగన్ నో చెప్పలేకపోయారు. వంశీ వినతికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మోటార్లకు విద్యుత్ సరఫరా ఆగకుండా చూడాలని ముఖ్యమంత్రిని వంశీ కోరారు.