జగన్ సర్కారుకు ‘వాల్మీకి’ సెగ

February 24, 2020
CTYPE html>
ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘వాల్మీకి’ సినిమా. కానీ విడుదలకు కొన్ని గంటల ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికప్పుడు టైటిల్ మార్చేయాల్సి వచ్చింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ వాల్మీకి/బోయ కుల సంఘాలు కొంత కాలంగా ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. వాళ్ల ఆందోళన ఎంత వరకు సమంజసం అనేది వేరే చర్చ. ఐతే తమ సినిమా వాల్మీకి మహర్షి మీద గౌరవం పెంచుతుంది తప్ప.. ఆయన్ని కానీ, ఆ కులస్థుల్ని కానీ కించపరిచేలా ఉండదని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఆందోళనలు మరీ పెద్ద స్థాయిలో ఏమీ జరగలేదు కాబట్టి తమ వెర్షనేంటో చెప్పి ఊరుకుంది చిత్ర బృందం. కానీ రిలీజ్ ముందు రోజు అనూహ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సినిమా ప్రదర్శనను ఆపాలంటూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది.
ఇప్పటికప్పుడు చర్చలు, రాజీలు అంటే కుదరని పని అని.. వేగంగా స్పందించి టైటిల్ మారుస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ పరిణామం టాలీవుడ్ జనాల్ని తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురి చేసింది. రెండు జిల్లాల కలెక్టర్లు ఇప్పటికప్పుడు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని సినీ జనాలు ఆక్షేపిస్తున్నారు. ఈ పరిణామాల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మద్దతు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న నేపత్యంలో ఆయన అన్న కొడుకైన వరుణ్ సినిమాకు బ్రేకులు వేసేలా వైకాపా వర్గాలు తెర వెనుక మంత్రాంగం నడిపాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా లేదా అన్నది చెప్పలేం. కానీ ఈ వ్యవహారంలో వ్యూహాత్మక మౌనం పాటించడం, ఆందోళనకారుల్ని అదుపు చేయకపోవడం, ఏ రకంగానూ ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రభుత్వం వైపు నుంచి పెద్దరికం పాటించకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు మెగా అభిమానులు.