వర్మ.. ఇంతకీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్నారా? లేదా?

July 03, 2020

దివంగత నేత, నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తీసున్నాం.. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయి అంటూ వీరోచిత డైలాగులు కొట్టిన వర్మ.. తీరా విడుదల సమయానికి మాట మార్చేస్తున్నారు. సినిమాను బిజినెస్ చేసుకోవడంలో ఆయనను మించిన ఘనుడు మరొకరు ఉండరనే చెప్పుకోవచ్చు. సరిగ్గా ఎన్నికల వేళ ఇలాంటి సబ్జెక్టుతో బాగా మార్కెట్ చేసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. గత రెండు నెలలుగా ఎడతెగకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. టీవీ ఇంటర్వ్యూలు వరసబెట్టి గుప్పించేస్తున్నాడు. ఏ మీడియా ఛానల్ అడిగినా కాదనకుండా స్టూడియోకు వెళ్ళిపోతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ 29న అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అనే దాని గురించి ఇంకా మబ్బులు వీడిపోలేదు.

మార్చి 22 అన్నాడు.. ఆ తర్వాత మార్చి 29 అన్నాడు.. చూస్తేనేమో ఈ సినిమాపై సెన్సార్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. సెన్సార్ అధికారులు ఇంకా ఫైనల్ వెర్షన్ చూడనే లేదని తెలుస్తోంది. అసలైతే ఈ పాటికే సెన్సార్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఫినిష్ కావాలి. కానీ జరగలేదు. మిగిలిన వాటిని పక్కన పెట్టి యుద్ధ ప్రతిపాదికన ఇది చూసేయమని కోర్టు కూడా చెప్పలేదు. అంతా రూల్స్ ప్రకారం జరిగిపోవాల్సిందే. అయితే ఇక్కడ ఇక్కడ వర్మ అజాగ్రత్త అనేది స్పష్టంగా కనిపిస్తోంది. విడుదల తేదీని ముందే ప్రకటించి నిబంధనల ప్రకారం కాకుండా లోపాయికారిగా చివరి నిమిషంలో సెన్సార్ చేయించడం పెద్ద నిర్మాతలు పాటించే ఎత్తుగడే. కానీ ఏకంగా ఎన్నికల కమీషన్ దృష్టిలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లీగల్ గా సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతో సెన్సార్ బోర్డు అన్ని పక్కాగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తోందట. ఇలా చూస్తే మిగిలింది 6 రోజులే. ఈ 6 రోజుల వ్యవధిలో ఇదంతా కొలిక్కి వచ్చే సూచనలు అస్సలు కనిపించడం లేదు. అప్పుడు వర్మ నా తప్పేమి లేదు సెన్సార్ లేట్ చేసిందని చేతులెత్తేస్తాడు. ఇది ఆయనకు అలవాటేగా. ఇలా అయితే ఎలా వర్మ..? నిజం చెప్పాలనుకున్నోడివి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం ఆ విష్యం కూడా తెలియని నువ్వు సినిమాలో ఏం చూపించి ఉంటావ్? ఇదంతా ఒట్టి హైప్ మాత్రమే! అంటున్నారు జనం.