గాంధీ ట్యాగ్ ఉంది కానీ..మోడీ కోసం ఇలా! నిజంగా ఆశ్చర్యకరమే

July 03, 2020

రాజకీయాలంటేనే ఓ రకమైన రణరంగాలు. ఎప్పుడు ఏ నాయకుడు ఎలా మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. ఈ కోవలోనే గాంధీ ట్యాగ్ లైన్ ఉన్నప్పటికీ.. వరుణ్ గాంధీ తమ సొంత వారి కంటే మోడీనే గ్రేట్ అని చెప్పడం, ఆయనే దేశంలో కీర్తించదగిన ప్రధాని అని కొనియాడటం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. గాంధీ ట్యాగ్ తో బీజేపీలో ఉంటూ.. కీలక స్థానాన్ని చేజిక్కించుకోవటానికి ఎంతో కాలంగా చకోర పక్షిలా ఎదురుచూస్తున్న వరుణ్ గాంధీ.. ఎవరూ ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసి షాకిచ్చారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కొడుకుకు కొడుకైన వరుణ్ గాంధీ బీజేపీలో కొంత కాలంగా ఉండటం తెలిసిందే. బీజేపీలో గొప్ప స్థానం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోడీ మనసును దోచుకోవటానికి ఆయన మాట్లాడుతున్న తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు దేశ జనమంతా ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసిన వరుణ్ గాంధీ.. మోడీని ఆకాశానికి ఎత్తేయటానికి తన కుటుంబం నుంచి వచ్చిన ప్రధానమంత్రుల్ని సైతం తక్కువ చేయటానికి వెనుకాడకపోవడం గమనార్హం. తన ఇంటి పేరు ప్రఖ్యాతుల్ని పక్కన పెట్టేసి.. తన రాజకీయ ప్రయోజనమే ముఖ్యమని భావించారో ఏమో కానీ.. తన ఇంటి నుంచి ఎన్నికైన ప్రధానుల కంటే మోడీయే దేశానికి ఎక్కువ పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దేశం కోసమే మోడీ జీవిస్తున్నారని, దేశం కోసమే ఆయన మరణిస్తారని వరుణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు గాంధీ కుటుంబాన్ని, అటు దేశ ప్రజలందరినీ విస్తుపోయేలా చేశాయి. ఓ పక్క బీజేపీ వ్యవస్థాపకుడు, మోడీకి గురువైన అద్వానీనే మోడీపై సుతిమెత్తటి విమర్శలు చేసిన వేళ.. మోడీపై ఆ మరక చెరిగిపోయేలా మొనగాడి ఇమేజ్ ను కట్టబెట్టేందుకు వరుణ్ గాంధీ ప్రయత్నిస్తూ.. ఏకంగా నెహ్రు, ఇందిర గాంధీ, రాజీవ్ గాంధీల కంటే మెరుగైన ప్రధానిగా ఆయనను కీర్తించటం విశేషం.

వాజ్పేయ్, మోడీ ఇద్దరు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారని, వారెప్పుడు కూడా అవినీతికి పాల్పడలేదన్న వరుణ్ గాంధీ.. గత ఐదేళ్లలో బీజేపీ పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. ఆయనకు సొంత కుటుంబమే లేనప్పుడు.. ఎవరి కోసం అవినీతికి పాల్పడతారని వరుణ్ ప్రశ్నించారు. ఇటీవల వరుణ్ తల్లి మేనకాగాంధీ మాట్లాడుతూ.. అద్భుతం జరిగితే తప్పించి రాహుల్ ప్రధానమంత్రి కాలేరని వ్యాఖ్యానించగా, ఇప్పుడేమో వరుణ్ మరో అడుగు ముందుకేస్తూ ఏకంగా తన ఇంటి నుంచి వచ్చిన ప్రధానుల కంటే మోడీనే మెరుగైన ప్రధాని అని కీర్తించటం దేశంలో పలు చర్చలకు దారితీస్తోంది. ఎంతైనా రాజకీయం రాజకీయమే కదా! ఆ సందర్భంలో కుటుంబం వారికెందుకు గుర్తొస్తుంది లెండి! కాకపోతే వేరు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నత స్థానం సంపాదించాలనేదే ఆయన కోరిక అని స్పష్టమవుతోంది!.