వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుక 

August 06, 2020

కాలజ్జాని వీరబ్రహ్మేంద్రస్వామి  411 వ జయంతిని హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వీరబ్రహ్మంగారి జయంతిని జరుపుతారు. వీరబ్రహ్మేంద్రస్వామి కృతాంబ, పరిపూర్ణాచార్యులు అనే విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నది తీరంలో క్రీస్తుశకం 1608లో కార్తీక శుద్ధ ద్వాదశిరోజు నాడు జన్మించారు. అత్రి మున్యాశ్రమంలో శిష్యులుగా పెరిగారు. బ్రహ్మంగారి బాల్యం కర్ణాటక పాపాఘ్ని మఠాధిపతులు యనమందల వీరభోజయ్య, వీరపాపమాంబ దంపతులకు దత్త పుత్రులుగా కొనసాగింది. కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగానపల్లెలో గరివిరెడ్డి అచ్చమ్మ, వెంకటరె డ్డి దంపతుల ఇంట పశువులు కాపరిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన శక్తి నలుగురికి తెలిసింది. రవ్వల కొండలో సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానం రచించారు.

ఈరోజు ఉదయం 9.00 గంటలకు ట్యాంక్ బండ్ మీద బ్రహ్మంగారి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ మీద నిరసన కార్యక్రమం జరపడం మూలంగా... ఈ కార్యక్రమాన్ని దగ్గరలో  ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. అట్లూరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది వీరబ్రహ్మ భక్తులు పాల్గొన్నారు. 

సిద్ధయ్య అనే మహమ్మదీయుడిని శిష్యుడిగా చేసుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి  సమాజంలోని కుల జాఢ్యాన్ని రూపుమాపడానికి కృషి చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఆయన పేరిట పెద్ద మఠం ఉంది. ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సంఘసంస్కర్తగా కూడా ఆయన పేరు మోశారు. ఆయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం. 85 ఏళ్ల వయసులో 1693 సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమినాడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు మఠంలో సజీవ సమాధి అయ్యారు అని పక్కా ఆధారాలున్నాయి. సమాధి నుంచే జగత్ కల్యాణం కోసం యోగనిద్రలో ఉంటూ  స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు.