ప్రచారం ముగిశాక.. షాకిచ్చిన ఎన్నికల సంఘం

July 12, 2020

ఎన్నికలు అంటే నాయకులకు పదవులు వస్తాయి. కానీ నలుగురు పోటీ పడితే ఒక్కరికి పదవి దక్కుతుంది. అందునా ప్రజలు తీసే ఆ లాటరీలో వస్తుందో రాదో తెలియని పదవి కోసం నాయకులు పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు. ఎన్నికల ప్రచారం అంటే నాయకులకు శ్రమ, ఖర్చు, ఒత్తిడి... ఈ మూడు భారీ స్థాయిలో ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని ప్రచారం ముగిసిన రోజు దేవుడా... థాంక్స్ అని చెప్పుకునే పరిస్థితి. మరి అలాంటిది హమ్మయ్య అంతా ముగిసింది అని ఖర్చంతా పెట్టి, కష్టమంతటా పడ్డాక ... ఈ ఎన్నిక క్యాన్సిల్ అని ఎన్నికల సంఘం వాయిదా వేస్తే ఆ నాయకుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. సరిగ్గా ఇదే జరిగింది తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు నియోజకవర్గంలో. దేశంలో అత్యధికంగా డబ్బు ఏరులై పారిన నియోజకవర్గం అది. ప్రతి పార్టీ ఎలాగైనా అక్కడ గెలవాల్సిందే అని పట్టుదలకు పోవడంతో పెద్ద ఎత్తున పట్టుబడుతోంది.

ఎల్లుండి రెండో దశ పోలింగ్ దేశ వ్యాప్తంగా జరగనుంది. దీంతో నేటి సాయంత్రంతో రెండో దశ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర పడింది. ఈ  కీలక తరుణంలో తమిళనాడులోని వేలూరు పార్లమెంటు ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ నియోజకవర్గ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.

ఇంతకీ ఈ కఠిన నిర్ణయం వెనుక కారణం ఏంటంటే.. వేలూరు బరిలోకి నిలిచిన డీఎంకే అభ్యర్థి వద్ద ఇటీవల పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. అది కోట్లలో ఉంది. ఆ అభ్యర్థఇ బరితెగించి మరీ తన ఆఫీసులోనే ఆ డబ్బంతా పెట్టుకున్నాడు. దీంతో అదికారుల దాడుల్లో మొత్తం వెలుగు చూసింది. ఇప్పటికే ఇక్కడ డబ్బు పంపకం గురించి చాలా ఫిర్యాదులు రావడం, తాజా గా దానికి తగ్గట్టు భారీగా నగదు పట్టుబడటంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందట.

ఈ నియోజకవర్గంలో ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలను రద్దు చేయాలా? వద్దా? అన్న కోణంలో సమీక్షలు నిర్వహించింది. అది ఇబ్బంది అని తెలిసి రద్దు చేయం అని నిన్నటివరకు చెప్పిందో. తాజాగా ఏమైందో ఏమో ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే వేలూరు ఎన్నికను రద్దు చేస్తు ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. చివరకు డబ్బు పట్టుబడిన డీఎంకే కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఓటర్లు కూడా డిజప్పాయింట్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఆందోళన చెందాయి.