ఎగ్జిట్ పోల్స్ పై ఆయనెలా మాట్లాడతారబ్బా?

May 29, 2020

దేశంలోని ప్ర‌జానిక‌మే కాకుండా...విదేశాల్లోని ప్ర‌వాస భార‌తీయులు, ఇత‌రులు ఆస‌క్తి చూపిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ ఘ‌ట్టం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు ముందు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందని నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీఏకు 300లకు పైగా, యూపీఏకు 120 స్థానాలకు పైగా వస్తాయని తెలిపాయి. ఏపీలో వైసీపీ అధికారం చేప‌డుతుందని, తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుంద‌ని అంచ‌నా వేశాయి.

అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ ఎగ్జిట్‌పోల్స్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎగ్జిట్ పోల్స్ exact పోల్స్ (కచ్చితమైనవి) కావని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని వెంక‌య్య‌నాయుడు అన్నారు. 1999 నుంచి అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి పార్టీ కూడా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి, మే 23 వరకు వేచి ఉండడం మంచిదని సూచించారు. ఈ దేశం సమర్థవంతమైన నాయకుడిని, సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు.

దేశంలోని అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రిగా పేరొందిన వెంక‌య్య నాయుడు ఎగ్జిట్ పోల్స్‌పై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తించాయి. అదే స‌మ‌యంలో....ఎగ్జిట్‌పోల్స్‌పై నిరాశ‌తో ఉన్న పార్టీల‌కు ఉత్సాహాన్ని ఇవ్వ‌గా... ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌తో ఫ‌లితాల‌పై భారీ విశ్వాసం పెట్టుకున్న పార్టీలు నిరాశ‌ప‌డ‌టం ఖాయ‌మ‌ని మ‌రికొంద‌రు విశ్లేషిస్తున్నారు.