తిరుమలేశుడి సొమ్ముపై కన్ను?

August 04, 2020

ట్రస్టుల ఆస్తుల స్వాహాకు పెద్దల యత్నం
నిధుల నిర్వహణకు కొత్త కంపెనీ
డిపాజిట్లు, మార్కెట్‌లో పెట్టుబడులు
‘ఎండోమెంట్స్‌’ పేరిట గుడి హుండీలకూ టెండర్‌
టీటీడీలోనే అధికంగా కాసుల గలగల
ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌ పేరిట
సొంత అవసరాలకు సొమ్ములు?
నిధుల కోసం జగన్‌ ప్రభుత్వం ఓ తెలివైన పాచిక విసరబోతోంది. తనవికాని సొమ్ములతో షోకులు చేసుకుని.. పనిలోపనిగా స్వాహా చేయడానికి వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌) ఏర్పాటుకు సమాయత్తమైంది. ఈ కంపెనీ అస్థిత్వంలోకి వస్తే.. అన్నిటికంటే ఎక్కువగా, ముందుగా చిల్లు పడేది ఏడుకొండలవాడి హుండీకే! ఆలయాలతోపాటు ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్ల నిధులన్నిటినీ ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ లాగేసుకుని.. వాటితో వడ్డీ వ్యాపారం చేయొచ్చు. షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులూ పెట్టవచ్చు. ఎప్పటికప్పుడు ఖజానాలో నిధుల కొరత లేకుండా, తక్షణావసరాలు తీర్చుకునేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి కామధేనువు అవుతుందన్న మాట. ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ప్రభుత్వ పెద్దగా ఉన్న రాష్ట్ర గవర్నర్‌తోపాటు మరో ఆరుగురికి షేర్లు కేటాయించారు. రూ.100 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేస్తున్నామంటూ.. 20 లక్షల షేర్లు జారీ చేశారు. దీనికి అనుమతి కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేయనున్నారు. అయితే ఈ సంస్థ ఏర్పాటు వెనుక అనేక దురుద్దేశాలు కనిపిస్తున్నాయి.
భారీ మనీ ప్లాన్‌..
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రప్రభుత్వం రోజువారీ అవసరాలు, ఉద్యోగుల వేతనాల కోసం నానా కష్టాలు పడుతోంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌లకు వెళుతోంది. ప్రతినెలా అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ప్రభుత్వంపై నమ్మకం లేక బ్యాంకులు వెనుకాముందాడుతున్నాయి. దీంతో వీటిని దారికి తెచ్చుకునేందుకు సొంతంగా ప్రభుత్వ రంగ బ్యాంకును ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ గతంలో నిర్ణయించారు. కానీ అదంత సులభం కాదని, ఆర్‌బీఐ అంగీకరించే అవకాశాల్లేవని తేలడంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ కార్పొరేషన్‌ పేరిట భారీ ‘మనీ ప్లాన్‌’ మొదలుపెట్టారు. ప్రముఖ దేవాలయాలు, మాన్సాస్‌, సింహాచల దేవస్థానం ట్రస్టు సహా ఆయా సంస్థల వద్ద ఉన్న నగదును మరింత సమర్థంగా, తనకు ‘లాభదాయకం’గా మార్చేందుకు కొత్త కంపెనీ ‘ప్రొఫెషనల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌’ వ్యవస్థలా సేవలు అందిస్తుందని సదరు ప్లాన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం ప్రతిపత్తి ఉన్న బోర్డులు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల నుంచి ఈ కంపెనీకి నిధులు మళ్లిస్తారు. ఇది జారీ చేసే ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్లు, డిబెంచర్లు, నగదు డిపాజిట్లు లేదా ఇతర స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ పద్ధతుల ద్వారా నిధులు కూడా సేకరిస్తారు. అలా సేకరించిన నిధులను మంచి వడ్డీ ఇచ్చే బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి రుణాలు, ఏఏఏ రేటింగ్‌ ఉన్న బాండ్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులుగా పెడతారట! నిజానికి ప్రభుత్వ కార్పొరేషన్లు, ట్రస్టులు, ఎండోమెంట్లు, యూనివర్సిటీలు, అథారిటీలు, బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల్లో భారీగా మిగులు నిధులు ఉన్న సంస్థలు బహు తక్కువ. తమ సొంత అవసరాలకే అప్పులు చేస్తూ నానా తిప్పలు పడుతున్నాయి. ఇక మిగిలింది... తిరుమల తిరుపతి దేవస్థానమే! కానీ... నేరుగా టీటీడీ నిధులు, బంగారం సేకరించాలని ప్రతిపాదిస్తే వివాదాస్పదమవుతుందని భయపడి.. కార్పొరేషన్లు, బోర్డులు, యూనివర్సిటీలు అంటూ ఇతర సంస్థలనూ జాబితాలో చేర్చారు. వెంకన్న హుండీకి రోజూ 2 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. బ్యాంకుల్లో వేల కోట్ల డిపాజిట్లు, బంగారం నిల్వలు ఉన్నాయి. టీటీడీ పరిధిలో అనేక ట్రస్టులు కూడా ఉన్నాయి. ఒక్క నిత్యాన్నదాన ట్రస్టుకే రూ.1300 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయు. వెరసి.. నిధులతో పుష్కలంగా కళకళలాడుతున్న తిరుమల ఆలయ నిధులే ప్రధాన లక్ష్యంగా ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ ఏర్పాటవుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎవరి సొమ్ముతో షోకులు?
నిబంధనల ప్రకారం తిరుమల వెంకన్న సొమ్ముతోపాటు, ఇతర దేవాలయాలకు భక్తులు, దాతల నుంచి వచ్చే సొమ్మును దారి మళ్లించడానికి వీల్లేదు. ఆ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించడానికి వీల్లేదు. ‘ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌’ పేరిట ఇప్పుడు టీటీడీ నిధులను ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌కు తరలించే అవకాశముంది. నిజానికి... టీటీడీ తన నిధులను బలమైన కార్పొరేట్‌ సంస్థలతో సమానంగా జాగ్రత్త చేసుకుంటుంది. టీటీడీలో అత్యున్నత అర్హతలు, అనుభవం ఉన్న ఆర్థిక నిపుణుడి పర్యవేక్షణలో ఆర్థిక నిర్వహణ జరుగుతుంది. మరి కొత్తగా ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ చేయబోయే ‘ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌’ ఏమిటో? ఎలా ఉంటుందో?
యూనివర్సిటీలనూ వదలరు..
యూనివర్సిటీలు, వాటి పరిధిలోని సంస్థల సొమ్మును ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌కు మళ్లించే అవకాశం కల్పించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నుంచి విశ్వవిద్యాలయాల నిర్వహణ, పరిశోధన తదితర అవసరాల కోసం నిధులు వస్తుంటాయి. ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, ఇతర పద్దుల కింద విద్యార్థులూ ఫీజులు చెల్లిస్తారు. ఇక రాష్ట్రంలో 30కిపైగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటికి రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆస్తులు కూడా ఉన్నాయి. పేదల సంక్షేమానికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంతోపాటు ఇతర కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటికి కేంద్రం నుంచి కూడా భారీగా నిధులు వస్తుంటాయి. కానీ ఒకట్రెండు కార్పొరేషన్లు తప్ప.. మిగిలిన వాటి వద్ద నిర్వహణకు సరిపడా నిధులు మాత్రమే ఉంటాయి.
స్వాహాలో సృజనాత్మకత
ఆయా విభాగాల నుంచి జమ అయిన సొమ్ముతో ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తుందని జీవోలో చెప్పారు. ఈ కంపెనీ అద్భుతమైన, సృజనాత్మకతతో కూడిన ఆర్థిక విధానాలను అవలంబిస్తుందట! జమయ్యే సొమ్మును అధిక వడ్డీలకు ఇస్తామని.. బిడ్డింగ్‌ ద్వారా ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తే, ఆ బ్యాంకులోనే డిపాజిట్‌ చేస్తామని చెప్పారు. వడ్డీ రూపంలో వచ్చే సొమ్ము ఎస్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలో జమ అవుతుంది. ఆ వడ్డీని ఆయా సంస్థలకు ఇస్తారో లేదో జీవోలో పేర్కొనలేదు. భారీ లాభాలను అన్వేషించే ప్రయత్నంలో షేర్‌మార్కెట్‌లోనూ పెట్టుబడులు పెడతారట! అవసరాన్ని బట్టి ఎస్‌ఎఫ్‌ఎస్‌ను షేర్‌మార్కెట్‌లో రిజిస్టర్‌ చేసి ఐపీవోకు కూడా వెళ్తారట! ఎస్‌ఎఫ్‌ఎస్‌ నిర్వహణకోసం ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా బోర్డును ఏర్పాటు చేశారు. ఆర్ధిక శాఖ ప్రధాన ముఖ్యకార్యదర్శి వీసీఎండీగా, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి డైరెక్టర్లుగా ఉంటారు. ప్రభుత్వం కొత్త వారిని, స్వతంత్ర వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించవచ్చు. అంటే జగన్‌గారి ఆడిటర్‌ విజయసాయిరెడ్డి ఉండనే ఉన్నారు. మార్కెట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఓ సీఈవోని నియమించుకోవచ్చట! అంటే మరో తాబేదారుకు పెద్ద పదవి లభిస్తుందనే!