ఆ బేన‌ర్లో సినిమా చేస్తే.. ఆ భ‌యం తొల‌గిన‌ట్లే

August 12, 2020

ద్వితీయ విఘ్నం.. టాలీవుడ్లో యువ ద‌ర్శ‌కులంద‌రినీ భ‌య‌పెట్టే సెంటిమెంటు ఇది. ఎంతోమంది ద‌ర్శ‌కులు దీని బారిన ప‌డ్డ వాళ్లే. తొలి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టి.. రెండో సినిమాకు అంచ‌నాలు అందుకోలేక చ‌తికిల‌బ‌డ్డ ద‌ర్శ‌కులు చాలామంది క‌నిపిస్తారు. ఐతే ఇప్పుడు ఓ బేన‌ర్ అలాంటి ద‌ర్శ‌కుల‌కు అభ‌య హ‌స్తం ఇస్తోంది. తొలి సినిమా స‌క్సెస్ త‌ర్వాత ఈ బేన‌ర్లో సినిమా చేస్తే ద్వితీయ విఘ్నం తొల‌గిపోతుంద‌న్న సెంటిమెంటు బ‌ల‌ప‌డుతుండ‌టం విశేషం.
ఆ బేన‌ర్ మ‌రేదో కాదు.. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ భీష్మ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంట‌ర్టైన్మెంట్స్. గీతా ఆర్ట్స్ సంస్థ మీడియం రేంజ్ సినిమాల కోసం జీఏ-2 బేన‌ర్ పెట్టుకున్న‌ట్లు.. భారీ చిత్రాలు తీసే హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ మీడియం రేంజ్ సినిమాల కోసం పెట్టుకున్న బేన‌ర్ సితార ఎంట‌ర్టైన్మెంట్స్. ఈ బేన‌ర్ మీద సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
కార్తికేయ సినిమాతో అరంగేట్రంలోనే సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన చందూ మొండేటి త‌న రెండో సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్‌లో చేశాడు. నాగ‌చైత‌న్య హీరోగా అత‌ను తీసిన ప్రేమ‌మ్ సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఐతే చందూ త‌న త‌ర్వాతి సినిమా స‌వ్య‌సాచితో మాత్రం దెబ్బ తిన్నాడు. ఇక ఈ బేన‌ర్లో ద్వితీయ విఘ్నాన్ని అధిగ‌మించిన మ‌రో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. మ‌ళ్ళీ రావా త‌ర్వాత అత‌ను ఈ బేన‌ర్లో చేసిన జెర్సీ సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు వెంకీ కుడుముల సైతం ఈ జాబితాలో చేరాడు. ఛ‌లో త‌ర్వాత అత‌ను సితార వాళ్ల‌తో చేసిన భీష్మ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాబ‌ట్టి ఇక‌పై తొలి సినిమాతో హిట్టు కొట్టిన ద‌ర్శ‌కులు సితార‌ను ఆశ్ర‌యిస్తే ద్వితీయ విఘ్నాన్ని సులువుగా అధిగ‌మించ‌వ‌చ్చేమో.