వైకాపా ఎంపీకి షాక్... విడదల రజని రేంజే వేరు

August 07, 2020

వైకాపా ఎమ్మెల్యే విడదల రజని తీరే వేరు. ఆమె తనది మంత్రి రేంజ్ అనుకుంటుంది. అసలు తనకు మంత్రి ఈయక పోవడం జగన్ చేసిన చారిత్రక తప్పిదం అంటూ ఉంటుందట తన అనుచరులతో. అంగబలం, అర్థ బలం రెండూ ఉన్న విడదల రజని ఒక ఫైర్ బ్రాండ్. టీడీపీలో ఉన్నపుడు మంత్రి పుల్లారావు వర్గంలో ఉండేది. కేవలం సాధారణ కార్యకర్తగా చేరి, మూడేళ్లలోనే పుల్లారావుకు కాదు నాకు సీటు ఇవ్వండని టీడీపీ అధిష్టానాన్ని ఆశ్చర్యపరిచిన రజని... అక్కడ నో చెప్పడంతో వేగంగా వైసీపీలో చేరిపోయింది. అంతేకాదు సీటు తెచ్చుకుని గెలిచింది. ఇది అందరికీ షాక్.

అయితే, తన ప్రాంతంలో వేరే వాళ్లు ఆధిపత్యం చెలాయించడానికి ఆమె అస్సలు ఒప్పుకోదు. అందుకే ఆమె తరచూ వివాదాలకు కారణం అవుతుంటుంది. దీంతో ​గుంటూరు జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు మళ్లీ రోడ్డున పడ్డాయి. తాజాగా ఎంపీ లావు కృష్ణదేవరాయల పర్యటనను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు మరోసారి అడ్డుకున్నారు. గతంలోను ఇలాగే జరిగింది. తాజాగా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని...  ఎమ్మెల్యే కూడా కాదు, ఆమె వర్గీయుడు మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి అడ్డుకున్నారు. 

చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణ తల్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకొన్నారు. దీంతో ఆ కుటుంబాన్నిపరామర్శించడానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. గ్రామ సమీపంలోకి ఎంపీ కారు రాగానే అప్పటికే అక్కడకి చేరుకున్న ఎమ్మెల్యే విడదల రజిని వర్గీయులు ఆయన్ని అడ్డుకున్నారు. 

మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎలా వస్తారని ఎంపీని మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సింగారెడ్డి కోటిరెడ్డి ప్రశ్నించారు. పరామర్శ కోసమే కదా అని ఎంపీ చెప్పినా పట్టించుకోలేదు. వాహనానికి అడ్డుపడ్డారు. చివరకు పోలీసులు పోలీసుల జోక్యంతో అతను పరామర్శకు అతికష్టమ్మీద వెళ్లాల్సి వచ్చింది.

ఈసారి నయం. ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా ఎంపీపై ఏకంగా దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి తన అనుయాయులతో దాడికి యత్నించారు. అపుడు రెండు గంటలకుపైగా ఎంపీ కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది.