శత్రువులను పెంచుకుంటున్న విజయదేవరకొండ

August 06, 2020

ఈ తరం కుర్రకారు తెర మీదే కాదు, బయట కూడా కొంచెం దూకుడుగా ఉండే, యాటిట్యూడ్ చూపించే హీరో హీరోయిన్లనే బాగా ఇష్టపడుతున్నారు. విజయ్ దేవరకొండ అనూహ్యంగా పాపులారిటీ సంపాదించుకుని యూత్‌లోకి దూసుకెళ్లిపోవడానికి అతడి యాటిట్యూడ్ ఓ కారణం. అయితే అతడితో కొందరు హీరోలు ‘యాటిట్యూడ్’ స్థాయిని దాటి ‘యారొగెన్స్’ వైపు వెళ్లిపోతుండటంతో అసలుకే సమస్య వస్తోంది. ఇతడికి పొగరెక్కువ అనే అభిప్రాయం బలపడి నెగెటివిటీకి దారి తీస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. రాను రాను నెగెటివిటీ పెరిగి సినిమాల ఫలితాలే మారిపోయే పరిస్థితి వస్తోంది. ఒకప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఆడేవి.. టాక్‌తో సంబంధం లేకుండా ఎలా ఓపెనింగ్స్ తెచ్చుకునేవి తెలిసిన సంగతే. కానీ ఈ మధ్య అతడి మీద జనాల్లో నెగెటివిటీ పెరిగింది. కొన్ని సందర్భాల్లో అతడి వ్యాఖ్యలు కొంచెం శ్రుతి మించి ఇతను యారొగెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకు. దీంతో ఇంతకుముందులా అతణ్ని ఎక్కువ మంది ఇష్టపడట్లేదు.

విజయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకొందరు యువ హీరోలు కూడా అతి చేశారు. విశ్వక్సేన్ అందులో ఒకడు. విజయ్‌ను దాదాపుగా అనుకరించాడతను. ‘ఫలక్‌నుమా దాస్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల్లో అతడి మాటలు శ్రుతి మించాయి. ఈ ప్రభావం సినిమాపై పడింది. తొలి రోజు తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ‘హిట్’ ముంగిట కూడా యారొగెంట్‌గానే మాట్లాడుతున్నాడు. ఈ ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు నాగశౌర్య గురించి చెప్పాల్సిన పనే లేదు. అతను అందర్లోకి యారొగెంట్‌గా కనిపిస్తాడు. తనతో పని చేసిన వాళ్లపై ముందు వెనుక చూసుకోకుండా విమర్శలు చేస్తాడు. ఇంతకుముందు సాయిపల్లవిని, తాజాగా వెంకీ కుడుములను ఇలాగే టార్గెట్ చేసి దెబ్బ తిన్నాడు. స్టార్ హీరోల్లో అల్లు అర్జున్‌లోనూ ఇలాంటి యారొగెన్సే కనిపిస్తుంది. ఆ ప్రభావం ‘నా పేరు సూర్య’ మీద పడ్డ విషయాన్ని మరిచిపోరాదు. అయినా అతను మారలేదు. ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ తర్వాత కూడా అతి చేస్తున్నాడు. మరి తర్వాతి సినిమా టైంలో జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.