టాక్ ఆఫ్ ద టాలీవుడ్.. విజ‌య్ ఇల్లు

May 31, 2020

విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చాడు. అత‌ను టాలీవుడ్ సెల‌బ్రెటీలు ఎక్కువ‌మంది ఉండే ఫిలిం న‌గ‌ర్ ఏరియాలో ల‌గ్జ‌రీ హౌస్ కొన‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. దాని ధ‌ర ఎంతంటే ఒక్కొక్క‌రు ఒక్కో ఫిగ‌ర్ చెబుతున్నారు. కొంద‌రు ప‌ది కోట్లంటే.. ఇంకొంద‌రు 15 కోట్లంటున్నారు. కొన్ని చోట్ల రూ.20 కోట్ల ఇల్లు కొన్న విజ‌య్ అంటూ కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఐతే అది ల‌గ్జీరియ‌స్ హౌస్ అన్న‌ది మాత్రం ప‌క్కా. ఇంత‌కుముందు ఎమ్మెల్యే కాల‌నీలో ఉన్న త‌న ఇంట్లో ఉంటూ వ‌చ్చిన విజ‌య్.. ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్‌కు మారిపోయాడు. మంగ‌ళ‌వారం ఉద‌యం అత‌ను కుటుంబ స‌మేతంగా గృహ ప్ర‌వేశం కూడా చేశాడు.
ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులెవ‌రూ హాజ‌రు కాలేదు. విజ‌య్‌కి స‌న్నిహితులైన స్వ‌ప్న ద‌త్, నాగ్ అశ్విన్ లాంటి కొంద‌రు మాత్ర‌మే వ‌చ్చారు. నామం పెట్టుకుని, పంచె క‌ట్టుకుని పూర్తిగా సంప్ర‌దాయ అవ‌తారంలోకి మారిపోయిన విజ‌య్‌ను చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదిలా ఉంటే.. త‌నకు హిట్లు వ‌స్తున్నా కూడా పెద్ద‌గా పారితోష‌కం తీసుకోవ‌ట్లేద‌ని.. నిర్మాత‌ల్ని డిమాండ్ చేయ‌ట్లేద‌ని.. త‌న సంపాద‌న‌లో 70 శాతం మొత్తాన్ని మీకు మాత్ర‌మే చెస్తా సినిమా మీద పెట్టుబ‌డిగా పెట్టాన‌ని అమాయ‌క క‌బుర్లు చెప్పిన విజ‌య్.. ఏకంగా రూ.10-15 కోట్ల దాకా ఖ‌ర్చు పెట్టి ఇల్లు కొన‌డం చిత్ర‌మే. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కార‌మైతే అత‌ను సినిమాకు రూ.10 కోట్ల దాకా తీసుకుంటున్నాడ‌ట‌. అంత రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుంటున్న‌పుడు ఈ రేంజిలో ఇల్లు కొన‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.