పవన్ ఫ్యాన్స్ కి దొరికిపోయాడు

August 08, 2020

వెబ్ సైట్లలో వచ్చే ఫేక్ న్యూస్, గాసిప్స్‌పై విజయ్ దేవరకొండ మొదలు పెట్టిన పోరాటం టాలీవుడ్లో బాగానే ఊపందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు సహా ఎంతోమంది పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు అతడికి మద్దతిచ్చారు. నిర్మాతల మండలి కూడా దీనిపై ఓ ప్రకటన చేసింది. తదుపరి కార్యాచరణ మీద కూడా చర్చ జరుగుతోంది. ఐతే ఇండస్ట్రీ ఒక్క తాటిపైకి వస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్ల కిందట పవన్ మీద ఒక వర్గం మీడియా మూకుమ్మడి దాడి చేసినపుడు వీళ్లంతా ఏమయ్యారనే ప్రశ్నలు వేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అప్పుడు పవన్‌ను ఒంటరి చేశారని.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌‌కు వచ్చి మరీ పవన్ ఆందోళన నిర్వహించినా ఎవ్వరూ స్పందించలేదని గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ తీరుపైనా పవన్ ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి పాత వీడియో ఒకటి బయటికి తీసి విజయ్ ద్వంద్వ ప్రమాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. 2017 అక్టోబరులో ఓ సినిమా వేడుకలో విజయ్ మాట్లాడుతూ కత్తి మహేష్ ప్రస్తావన తెచ్చాడు. అతణ్ని ‘నాన్ కాంట్రవర్శల్ మ్యాన్’గా అభివర్ణించాడు. ‘‘మనం ఏదైనా చేస్తే మినిమం డెత్ థ్రెట్ రావాలి’’ అని నవ్వుతూ కామెంట్ చేశాడు. దానికి కత్తి మహేష్ కూడా అలాగే నవ్వాడు. ఆ వేడుకకు కొన్ని నెలల ముందు నుంచి ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. కత్తి మహేష్ పవన్ మీద విమర్శలు, ఆరోపణలు చేయడం.. పవన్ ఫ్యాన్స్ అతణ్ని టార్గెట్ చేయడం.. ఇదో పెద్ద వివాదంగా మారడం.. కొన్ని నెలల పాటు ఈ రచ్చ నడిచింది. పవన్‌ను కత్తి మహేష అదే పనిగా టార్గెట్ చేయడంతో అభిమానులు అతడికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విజయ్ ఆ కామెంట్ చేశాడు. అప్పుడు పవన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన క్రిటిక్‌తో కలిసి కామెడీ చేయడాన్ని ఇప్పుడు గుర్తు చేసి ఆక్షేపిస్తున్నారు పవన్ అభిమానులు.