స్పెషల్ షో వేయలేదని ఫ్యాన్స్ షాపులను తగలబెట్టారు

June 03, 2020

నిజంగా నిజం. ఈ ఘటన గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తనకున్న అభిమానులు ఇలాంటి వారా? అని సదరు హీరో సైతం వణికిపోయే పరిణామం ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ రోజు విడుదలైన సినిమాల్లో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన బిగిల్ (తెలుగులో విజిల్) చిత్రాన్ని అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ షో వేయకపోవటంతో ఆగ్రహించిన అభిమానగణం బీభత్సం చేసేశారు.
గత రాత్రి తమిళనాడులోని కృష్ణగిరిలో బిగిల్ ప్రత్యేక షో వేయలేదు. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తమ అభిమాన నటుడి సినిమాను ప్రత్యేక ప్రదర్శన ఎందుకు వేయరంటూ థియేటర్ ను ధ్వంసం చేయటమే కాదు.. దగ్గర్లోని షాపులకు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగని అభిమానులు పోలీస్.. మున్సిపల్ వాహనాల్ని సైతం తగలెట్టేశారు.
తమ హీరో సినిమాను ప్రదర్శించే వరకూ వెనక్కి తగ్గేది లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనాకారుల్ని చెదరగొట్టారు. హింసాత్మక ఘటనలకు కారణమైన 37 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమేరా పుటేజ్ తో వీరిని గుర్తించారు.
తీవ్ర ఉద్రిక్తను రేకెత్తించిన ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు పోలీసులతో నిండిపోయినట్లు చెబుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాను స్పెషల్ షో వేయకపోతే మాత్రం ఇంతలా రచ్చ చేయటమా? అని అవాక్కు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో విజయ్ తో నయనతార జత కట్టారు.