ఈ విజయ్... జగన్ కు ఎంత ఇష్టుడో తెలుసా?

July 12, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారులంటే అంతెత్తున ఎగిరి పడేవారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత సీఎం పీఠం ఎక్కీ ఎక్కగానే అధికారులపై జగన్ తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నారనే చెప్పాలి. తనకు ఇష్టం లేని అధికారులను అప్పటికప్పుడే బదిలీ చేసి పారేసి... నెలలు గడుస్తున్నా కూడా పోస్టింగ్ లు ఇవ్వకుండా సతాయిస్తున్న జగన్... తనకు అనుకూలంగా ఉండే అధికారులను మాత్రం అందలం ఎక్కించేస్తున్నారు. పాలన అన్నాక.. అధికారులు లేకుండా ముందుకు సాగలేని విషయం తెలిసినా... కొందరు అధికారులకు మాత్రమే జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైనం మాత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొన్నటిదాకా అసలు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియని ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్... జగన్ పాలనలో ఓ రేంజిలో ఫోకస్ లోకి వచ్చేశారు. 

విజయ్ కుమార్ కు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే... అధికారులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 అదికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన విజయ్ కుమార్... ఆ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ గా మారిపోయారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ పొందిన విజయ్ కుమార్... విధి నిర్వహణలో అట్టర్ ప్లాప్ అయ్యారు. వెరసి ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి మార్క్ ఫెడ్ ఎండీగా బదిలీ అయిన విజయ్... ఆ తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారో కూడా తెలియలేదు. అయితే ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక విజయ్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న విజయ్ కి ఇప్పుడు జగన్ ఎన్ని కీలక బాధ్యతలు అప్పగించారో తెలిస్తే... నోరెళ్లబెట్టాల్సిందే.

ప్రస్తుతం పురపాలక శాఖ కమిషనర్ గా కొనసాగుతున్న విజయ్ కుమార్... సీఆర్డీఏ వ్యవహారాలన్నీ చూస్తున్నారు. అంతేనా రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరిలకు ఇంచార్జీ కమిషనర్ గా కూడా ఆయననే నియమిస్తూ ఇటీవలే జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడితోనే అయిపోలేదు... ఇప్పుడు ఏకంగా తన సొంత నియోజకవర్గ కేంద్రం పులివెందులకు కూడా విజయ్ కుమార్ ను ఇంచార్జీ కమిషనర్ గా జగన్ నియమించేశారు. అంటే... ఒక్క అధికారికి ఐదు కీలక బాద్యతలన్న మాట. అన్నట్లు ఈ విజయ్ కుమార్ ఎవరో గుర్తుపట్టారా? మొన్నామధ్య ఓ అధికారిక సమావేశంలో జగన్ ను ఏసుక్రీస్తుగా పోల్చిన అధికారే ఈ విజయ్ కుమార్. ఇంకా గుర్తు రాలేదా? మొన్నామధ్య మూడు రాజధానులంటూ జగన్ మాట్లాడితే... దానికి అనుకూలంగా నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదికను మీడియా సమావేశంలో చదివి వినిపించారే... ఆయనే విజయ్ కుమార్. ఇంకా గుర్తు రాలేదా?... జీఎన్ రావు కమిటీని చదివిన తనను దళితుడు అని దూషించారంటూ చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేశారే... ఆయనే విజయ్ కుమార్. ఇప్పుడర్థమైందా?... విజయ్ కుమార్ కు ఇన్ని కీలక బాధ్యతలు ఎందుకు దక్కుతున్నాయో?