అప్పుల ఊబిలో ఆ హీరో కమ్ పొలిటీషియన్

July 08, 2020

తమిళంలో ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్‌ల తర్వాతి స్థానంలో ఉన్న హీరో విజయ్ కాంత్. ఆయనకు తిరుగులేని మాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఉండేవి. సినిమాల్లో బాగానే సంపాదించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా రాణించాడు. తొలి ఎన్నికల్లో దెబ్బ తిన్నప్పటికీ.. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో (2010) పోటీ చేసి తన పార్టీ తరఫున 28 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నాడు. కానీ అప్పటి సీఎం జయలలితతో అనవసరంగా కయ్యానికి దిగిన విజయ్‌కాంత్.. చేజేతులా పార్టీని దెబ్బ తీసుకున్నాడు. తర్వాతి ఎన్నికలు వచ్చేసరికి పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విజయ్ కాంత్ పార్టీ నామమాత్రంగా కొనసాగుతోంది. సినిమాలు మానేసి.. పార్టీని నడపడానికి ఇబ్బందులు పడుతూ కష్టకాలంలో ఉన్నాడు విజయ్ కాంత్. ఇప్పుడు ఆయన అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.5 కోట్ల అప్పును చెల్లించకపోవడంతో విజయ్ కాంత్ ఆస్తుల్ని వేలం వేసే పరిస్థితి తలెత్తింది. విజయ్ కాంత్‌‌ నిర్వహిస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాల, ఇళ్ల నిర్మాణం కోసమని కొన్నేళ్ల కిందట ఐదు కోట్లకు పైగా రుణం తీసుకున్నాడు విజయ్ కాంత్. కానీ ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ కూడా చెల్లించట్లేదు. నోటీసులు ఇచ్చినా విజయ్ కాంత్ కుటుంబం స్పందించకపోవడంతో ఆయన ఆస్తుల్ని వేలం వేయడానికి బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారు. కళాశాలతో పాటు విజయ్‌కాంత్‌కు చెందిన రెండు నివాస స్థలాల్ని వేలానికి పెడుతూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్‌ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కార్యకర్తల్ని కూడా కలవట్లేదు. ఇలాంటి సమయంలో ఈ వేలం గురించి ప్రకటన రావడం ఆయన్ని మరింత కుంగదీసేదే. విజయ్‌కాంత్‌కు ఇంత కష్టం వచ్చిందా అంటూ ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.