అప్పులు తీర్చేస్తా.. ద‌య‌చేసి డబ్బులు తీసుకోమంటున్నాడు!

April 04, 2020

వేలాది కోట్ల రూపాయిల అప్పులు చేసి.. వాటిని తీర్చ‌కుండా.. గుట్టు చ‌ప్పుడు కాకుండా విదేశాల‌కు చెక్కేసిన మాల్యా క‌థ గురించి కొత్త‌గా చెప్పేదేమీ లేదు. ఆయ‌న్ను ఏదోలా భార‌త్ కు తీసుకొచ్చి.. శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానంలో కూర్చోబెట్టాల‌ని త‌పిస్తున్నాయి విచార‌ణ సంస్థ‌లు. అయితే.. ఈ మ‌ధ్య కాలంలో మాల్యా త‌న మాట‌ను మార్చారు.
ప్లీజ్ నేనుచేసిన అప్పుల‌న్ని తీర్చేస్తా.. నా డ‌బ్బులు తీసుకోండంటూ అభ్య‌ర్థిస్తున్నారు. తానిప్ప‌టికే చాలానే హేళ‌న‌లు చ‌వి చూశాన‌ని.. తాను చేసిన అప్పుల‌న్నింటిని తీర్చేస్తాన‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసుకొని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఎస్ బీఐతో స‌హా వివిధ బ్యాంకుల‌కు వేలాది కోట్లు ఎగ్గొట్టి లండ‌న్ కు 2016లో పారిపోయారు. రుణాల్ని తిరిగి చెల్లించే విష‌యంలో రాజీకి రావాల‌ని ఆయ‌న ఇప్ప‌టికే బ్యాంకుల‌ను కోరారు.
అయితే.. ఆయ‌న‌తో రాజీ చేసుకోవ‌టానికి బ్యాంకులు సిద్ధంగా లేవు. ఇదిలాఉంటే.. ఆయ‌న చేసిన త‌ప్పుల‌పై విచార‌ణ జ‌రిపేందుకు భార‌త్ కు అప్ప‌గించేందుకు లండ‌న్ కోర్టు ఓకే చెప్ప‌టం తెలిసిందే. అయితే.. స‌ద‌రు తీర్పును స‌వాలు చేసేందుకు అనుమ‌తించాలంటూ హైకోర్టులో పెట్టుకున్న పిటిష‌న్ కు సానుకూలంగా స్పందించి విచార‌ణ‌కు ఓకే చెప్పారు.
ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న ట్వీట్లు చేశారు. త‌న‌పై కావాల‌ని కేసులు పెట్టార‌ని.. దేవుడి ద‌య‌తో త‌న‌కు న్యాయం జ‌రిగింద‌న్న ఆయ‌న‌.. బ్యాంకుల‌కు తానిచ్చిన ఆఫ‌ర్ ను ఓకే చేయాల‌ని మ‌రోసారి కోరారు. భార‌త్ కు త‌న‌ను అప్ప‌గించే విష‌యంలో కోర్టు నిర్ణ‌యం ద్వారా త‌న‌కు న్యాయం జ‌రిగింద‌న్నారు. దేవుడు గొప్ప‌వాడిగా కీర్తించారు.
తాను ప‌దే ప‌దే చెబుతున్నాన‌ని.. త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టార‌ని.. కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ కు ఇచ్చిన రుణాల్ని తీర్చేస్తాన‌ని.. ద‌య‌చేసి ఆ డబ్బులు తీసుకోవాల‌న్నారు. అంతేకాదు ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తాన‌ని.. అప్పులు ఇచ్చిన ఇత‌రుల‌కు కూడా తాను డ‌బ్బులు ఇచ్చేస్తాన‌ని.. జీవితంలో ముందుకు సాగుతాన‌ని ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.
తానిప్ప‌టికే ప‌లు ర‌కాల హేళ‌న‌ల‌కు గుర‌య్యాన‌ని.. ఎంతో మంది త‌న‌ను అవ‌మానించార‌న్నారు. అలాంటి వారంతా ఇంగ్లండ్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పును గ‌మ‌నించాల‌న్నారు. మ‌రి.. మాల్యా తాజాగా చేసిన విన‌తికి ఆయ‌న‌కు అప్పు ఇచ్చిన బ్యాంకులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.