సూపర్ టాలెంటెడే.. కానీ పది కోట్లా?

May 27, 2020

గత దశాబ్ద కాలంలో దక్షిణాది నుంచి వచ్చిన అత్యుత్తమ నటుల జాబితా తీస్తే అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు విజయ్ సేతుపతిదే. విలన్‌గా మొదలుపెట్టి, తర్వాత హీరోగా మారి, మధ్య మధ్యలో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ ఏ పాత్ర ఇచ్చినా దాన్ని అద్భుతంగా పండిస్తూ నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్నాడు. సిన్సియర్‌గా పని చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతటదే వస్తుందనే మాటకు విజయే ఉదాహరణ. అతడి టాలెంట్ గురించి దక్షిణాది ప్రేక్షకులందరికీ తెలుసు. తెలుగు వాళ్లు కూడా అతణ్ని ఎంతగానో గౌరవిస్తారు. ఐతే డబ్బింగ్ సినిమాలతో పాటు ‘సైరా’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ.. ఇంకా అతడి స్థాయికి తగ్గ పాత్ర ఇక్కడ పడలేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే చిత్రంలో నెగెటివ్ రోల్ చేయనున్న సేతుపతి.. ఇందులో అతడి టాలెంట్ అంతా చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

ఐతే విజయ్ ఎంత ప్రతిభావంతుడైనా.. సినిమాకు ఎంతగా ప్లస్ అయ్యే అవకాశమున్నా.. ఈ చిత్రానికి ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే వార్తే ఇండస్ట్రీ జనాలకు షాకిస్తోంది. ‘సైరా’కు కానీ.. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఉప్పెన’కు కానీ విజయ్ మరీ ఎక్కువ రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోలేదట. ఐతే ‘ఉప్పెన’ను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే ప్రొడ్యూస్ చేస్తున్న బన్నీ-సుకుమార్ సినిమాకు మాత్రం విజయ్ ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఐతే ఈ చిత్రానికి బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండటం, దీని కోసం వేరే సినిమాలు వదులుకోవాల్సి రావడంతో విజయ్ అంత మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంద. మరి ఆ పది కోట్ల పారితోషకానికి న్యాయం చేసే రేంజిలో ఆ పాత్ర, అందులో విజయ్ పెర్ఫామెన్స్ ఉంటుందేమో చూడాలి.