కారు దిగడంపై నోరు విప్పిన సాయిరెడ్డి... లాజిక్ మిస్సయ్యింది

August 14, 2020

విశాఖపట్నం ఘోరకలి రోజున ముఖ్యమంత్రి జగన్ కారు ఎక్కిన కొద్ది క్షణాల్లోనే కారు దిగిన సాయిరెడ్డి ఘటన ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. అనేక గాసిప్స్ పుట్టుకువచ్చాయి. జగన్ కోప్పడ్డారని, కారు దించేశారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా దీనిపై ఎవరూ అడక్కుండానే నోరు విప్పారు సాయిరెడ్డి. 

వాస్తవానికి ఆరోజు విజయ సాయిరెడ్డి కారు దింపినప్పుడు వచ్చిన అనుమానం కన్నా సాయిరెడ్డి వివరణే ఎక్కువ అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఆయన చెప్పిన మాట వింటే మనకు ఈ విషయం అర్థమవుతుంది. సాయిరెడ్డి ఏమన్నారంటే.. ’’విశాఖ పట్నంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన రోజు హెలికాప్టర్‌లో ప్లేస్ లేదు. అందు వల్ల తాను కారు దిగిపోయాను. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యశాఖ మంత్రి అక్కడకు వెళితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తాను వెనక్కి తగ్గాను’’ అని వివరించారు. 

వివరణ బానే ఉంది గానీ...

1 చాలా సేపటి నుంచి కళ్ల ముందే ఆరోగ్య మంత్రి ఉన్నాడు. మరి ఎక్కడానికి ముందు ఎందుకు ఆలోచించలేదు అన్నది ఒక అనుమానం.

2. పోనీ ఎక్కిన 5 సెకండ్లకే కారు దిగిన నేపథ్యంలో కారులో ఎక్కి సర్దుకునేకే 5 సెకెండ్లు సరిపోదు. ఇక ఆలోచించే అవకాశం ఏడుంది? దిగు అని చెబితే దిగడానికి తప్ప ఆలోచించడానికి సాయిరెడ్డి ఎక్కి దిగిన సమయం సరిపోవడం లేదు.

3. హెలికాప్టర్ లో ప్లేస్ లేదు అన్నారు. ఆ విషయం ఎక్కేముందు ఐడియా లేదా? జగన్ ప్లేస్ లేదు నీకు దిగు అని చెబితే దిగారా? 

వాస్తవానికి విజయసాయిరెడ్డి వివరణ ఇలా ఉంటే అందరూ నమ్మేవారు :

‘‘వైజాగ్ తో నాకు అనుంబంధం ఎక్కువ. కాబట్టి నేను వెళ్దాం అనుకున్నాను. అయితే ముఖ్యమంత్రి జగన్... ఇపుడు ఆరోగ్య మంత్రి అవసరం నీకన్నా ఎక్కువ ఉంది కదా సాయిరెడ్డి... నీ కంటే ఆయన రావడం మంచిది అనడంతో అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్, ఆరోగ్యమంత్రిని తీసుకెళ్లండి, అదే సరైన నిర్ణయం’’ 

ఇలా చెప్పడానికి విజయసాయిరెడ్డికి ఆత్మాభిమానం అడ్డొచ్చినట్టు ఉంది. జగన్ చెబితే తాను తల ఊపినట్లు చెబితే బాగుండదనుకుని ఉంటారు. కానీ ఆయన ఈరోజు ఇచ్చిన వివరణ కంటే.... ఇలా చెప్పి ఉంటే మరింత మర్యాదకరంగా ఉండేది. నమ్మశక్యంగా ఉండేది. విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరణ మరిన్ని గాసిప్స్ కు అవకాశం ఇచ్చేలా ఉంది.