151 సీట్లు వచ్చినా ఈ బానిసత్వం ఏంది రెడ్డి?

December 05, 2019

ఏపీలో వైసీపీ పరిస్థితి జూలో సింహం లాగా తయారయ్యింది. సింహమే గానీ ఏం చేయలేని పరిస్థితి. 151 సీట్లు వచ్చినా, 22 ఎంపీ సీట్లు వచ్చినా నోరు మెదపలేని పరిస్థితిలో సీఎం ఉన్నారు. బలహీనంగా ఉన్న ప్రతిపక్షంపై ఆరోపణలు చేసి సంతృప్తి చెందడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. ఎందుకిలా... అంటే... స్విచ్ మోడీ చేతిలో ఉంది. ప్రధాని మోడీకి ఏ కారణం చేతనూ ఎదురుతిరిగే పరిస్థితి లేదు. అంతెందుకు కనీసం పదివేల ఓట్లు గెలవలేని కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు కూడా 151 సీట్లు సాధించిన వ్యక్తిని బూతులు తిడుతుంటే... నిస్సహాయులుగా ఉండిపోతున్నారు డ్యుయో రెడ్లు (జగన్ రెడ్డి - సాయిరెడ్డి). సీబీఐ బీజేపీ నేతలను అరెస్టు చేయడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలను సీనియర్లను కూడా అరెస్టు చేస్తోంది. దీని అర్థమేంటి? మోడీకి నచ్చని వారిపై సీబీఐ కన్ను గ్యారంటీ. పైగా ఇప్పటికే అనేక ఆధారాలు ఈడీ సీబీఐ దగ్గర ఉండటంతో బీజేపీతో పేచీ పెట్టుకోవడానికి జగన్ కు ఏ కోశానా అవకాశం లేదు.
కేవలం సైలెంట్ గా ఉంటూ జయహో మోడీ అనడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి. అదేంటి... బ్రహ్మాండంగా తనకిష్టమొచ్చిన వారికి పదవులు ఇస్తుంటే... 5 గురు డిప్యూటీ సీఎంలను పెడితే... ఇంకా ఏం కావాలి అంటున్నారా? జగన్ ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారా?

1. పోలవరం గురించి తన పరిధిలో ప్రయత్నాలు చేయడం మినహా కేంద్రాన్ని ఏ డిమాండ్ చేయలేదు.
2. గత బడ్జెట్లో రాష్ట్రానికి కేవలం 22 కోట్లు ఇచ్చారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతితక్కువ కేటాయింపు. అయినా ఒక్క విమర్శ చేయలేదు.
3. రాజధానికి నిధులు అడిగే ధైర్యం లేదు. కనీసం వరద సాయం అడిగే పరిస్థితి లేదు.
4. కేంద్రం కేటాయించిన ఇళ్లలో దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించింది. ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి లేదు.
5. పోర్టుల గురించి ప్రశ్నించలేదు.
6. విభజన చట్టంలో కేటాయించిన విద్యా సంస్థల బిల్డింగులకు ఇప్పటివరకు 10 శాతం నిధులే ఇచ్చారు. మిగతా 90 శాతం నిధులను అడగనే లేదు.
7. ఇక ప్రత్యేక హోదా తన ఊపిరి అని చెప్పి... ’’ఇంకేం చేద్దాం.. రిక్వెస్ట్ చేద్దాం‘‘ అన్నాడు. ఆ పనీ చేయలేదు.
ఇలా కేంద్రాన్ని ఏమీ అడగలేని, నిలదీయలేని, ప్రశ్నించలేని విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. పైగా కేంద్రమే మా అధిష్టానం. మోడీ, అమిత్ షాలకు చెప్పకుండా ఏమీ చేయం... అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు.
కేంద్రాన్ని నిలదీయడం పక్కనపెడితే... ఏపీలో టికానా లేని పురంధేశ్వరి, కన్నా, విష్ణకుమార్ రాజు వంటి నేతల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చుకోలేక సతమతం అవుతోంది వైసీపీ క్యాడర్. ఏపీ ప్రజలు ఉహించని భారీ మోజార్టీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని చెబితే... ఆ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తు, ఆ మెజారిటీకి విలువే లేకుండా చేశారు జగన్ అని సామాన్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే... దాని అర్థమేంటి? నువ్వు ఏం చేస్తావో చేసి చూపు, గత ప్రభుత్వం చేసింది మాకు నచ్చక నీకు అనుకూలంగా తీర్పు ఇచ్చాం అని. కానీ ఆ పనీ చేయడం లేదు మన ముఖ్యమంత్రి జగన్.

కొసమెరుపు ఏంటంటే... అన్ని చెప్పి చేయటానికి మోడీ, అమిత్ షా ఏమైనా వైసీసీ అధిష్టానమా? అని లోలోపల పలువురు సొంత నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.