ఆరోజు బాలకృష్ణ, నేను చనిపోయేవాళ్లం...

August 12, 2020

మనం జీవితంపై దేవుడి దయ చాలా ముఖ్యమని, చిరంజీవి, బాలకృష్ణ, నేను... మాతో పాటు చాలామంది చనిపోయేవారని, దేవుడి దయ వల్ల బతికామని తిరుపతి వద్ద విమానం క్రాష్ లాండింగ్ గుర్తు చేసుకున్నారు సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి. 2006లో నాయుడమ్మ సినిమా తర్వాత పద్నాలుగేళ్లకు విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రాజకీయాల్లో గ్యాప్ దొరకడమే సినిమాలు చేయడానికి కారణమని అన్నారు. అయితే మహేష్ బాబుతో నాకు నటించాలని ఉండటం, అనిల్ రావిపూడి చాలా సార్లు నాకు ొక కథ చెప్పాలని తిరగడం, ఇదే సమయంలో నాకు కుదరడం వల్ల ఈ సినిమా చేస్తున్నట్లు విజయశాంతి చెప్పారు. 

ఈ సందర్భంగా తన జీవితంలో ముఖ్య ఘట్టాలను ఆమె చెప్పుకొచ్చారు. సంవత్సరానికి 17 సినిమాలు చేసిన రోజులున్నాయని చెప్పారు. ఒకే రోజు ఆరేడు సినిమా షూటింగుల్లో పాల్గొన్నానని అన్నారు. ఇలా చేయడానికి చాలా క్రమశిక్షణ అవసరమని చెప్పారు. సినిమా కెరీర్ లో చాలా ప్రమాదాలను ఎదుర్కొన్నాను అని కొన్ని ఉదహరించారు. ఓ సినిమా షూటింగ్ లో నీళ్లల్లో కొట్టుకుపోయానని, మరో షూటింగ్ లో మంటల్లో చిక్కుకున్నానని.. రెండూ పెద్ద ప్రమాదాలే అన్నారు. అయితే, తిరుపతి విమాన ప్రమాదంలో మాత్రం ఇక బతకను అనుకున్నా గాని దేవుడు ఆశీర్వదించి జీవితంలో మరో ఛాన్స్ ఇచ్చాడని ఆమె పేర్కొంది. 

ఒకప్పుడు హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న విజయశాంతి మళ్లీ స్క్రీన్ పై కనిపించడం  చాలామందికి ఆనందమే... కథానాయిక కేంద్రంగా వచ్చిన సినిమాలు ఎక్కువ హిట్లు కొట్టింది ఆవిడే.