ఆశ్చర్యపర్చిన విక్రమ్.. వావ్! అప్పుడు 3 ఇప్పుడు 7

August 13, 2020

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరితమైన విలక్షణ హీరో విక్రమ్. చేసే సినిమాలు, కనిపించే రూపం, హావభావాలు అంన్నింటా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని ఇప్పటికే ఎన్నోసార్లు చాటుకున్నారు విక్రమ్. ''అపరిచితుడు, ఐ'' లాంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆశ్చర్యపరిచారు. అందుకే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కీర్తించబడుతూ అశేష అభిమాన వర్గం సంపాదించుకున్నారు విక్రమ్.
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు విక్రమ్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న 'కోబ్రా' సినిమాలో ఆయన నటిస్తున్నారు. చిత్రంలో విక్రమ్ సరసన  ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా 'కోబ్రా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో విక్రమ్ 7 డిఫెరెంట్ లుక్స్ లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ 7 లుక్స్ దేనికవే ప్రత్యేకంగా ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌, రాజకీయనాయకుడు, మత బోధకుడు, లవర్ బాయ్ ఇలా చాలా గెటప్స్ లో విక్రమ్ నటిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ఇలాగే 'అపరిచితుడు' సినిమాలో 3 గెటప్పులతో మెస్మరైజ్ చేశారు విక్రమ్. ఈ నేపథ్యంలో ఈ లుక్ చూసి ఈ సారి 7 గెటప్స్ తో అంతకుమించిన కిక్కించేందుకు విక్రమ్ రెడీ అవుతున్నారని చెప్పుకుంటున్నారు జనం.