విక్రమ్ ల్యాండ్ అయిన చోటులో ఏం జరిగిందో చెప్పిన నాసా

August 03, 2020

కోట్లాదిమంది భారతీయుల ఆశల్ని నిరాశపరుస్తూ ఆఖరి నిమిషంలో జరిగిన పరిణామంతో విక్రమ్ ల్యాండర్ తో ఇస్రో సంబంధాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం.. విక్రమ్ తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన నాసా ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.
విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేసినా.. అది సాధ్యం కాలేదని.. హార్డ్ ల్యాండ్ కావటంతోనే ఇప్పటి పరిస్థితి నెలకొన్నట్లుగా పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే వేళ.. బలంగా ఢీ కొందని తెలిపింది. అయితే.. తాము విక్రమ్ ఏ ప్రాంతంలో ఢీ కొన్న విషయాన్ని గుర్తించలేకపోయినట్లుగా వెల్లడిచింది. అయితే.. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్ కెమేరా ఫోటోల్ని తీసింది.
దాదాపు పది రోజుల క్రితం తీసినట్లుగా చెబుతున్న ఈ ఫోటోల్ని నాసా తాజాగా విడుదల చేసింది. ఆర్బిటర్ ఫోటోలో తీసే సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో చీకటి ఉండటంతో దట్టమైన నీడలో విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయిన విషయాన్ని గుర్తించలేకపోయినట్లు పేర్కొంది. అయితే.. అక్టోబరులో చంద్రుడి పగటి కాలంలో మరోసారి ఇదే ప్రాంతానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని.. ఆ సమయంలో మరోసారి ఫోటోలు తీసి.. విక్రమ్ జాడను కనుగునేలా మరికొన్ని చిత్రాలు తీసే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించింది.
తాజా కసరత్తుతో విక్రమ్ ల్యాండింగ్ లో చోటు చేసుకున్న తప్పుల్ని తెలుసుకునే అవకాశం తో పాటు.. విక్రమ్ జాడను కనుగునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తప్పుల్ని తెలుసుకోవటం ద్వారా తర్వాతి ప్రయోగంలో అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి సాయం కానుంది. ఇదిలా ఉంటే.. తాము తీసిన ఫోటోల్ని నాసా విడుదల చేసింది.
విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావాల్సిన ప్రాంతాన్ని ఎల్ ఆర్ వోసీ తన కెమేరాలతో చంద్రుడిపైన 150 కిలోమీటర్ల పరిధి మేర చిత్రీకరించింది. ఈ ప్రాంతంలో విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయ్యిందన్న విషయాన్ని రానున్న రోజుల్లో మరోసారి తీసే ఫోటోల ఆధారంగా గుర్తించే వీలున్నట్లుగా చెబుతున్నారు.