ఎల్జీ కంపెనీ మూసేవరకు శవాలు తీయం

June 02, 2020

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ్యాక్టరీ ముందు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు శవాలతో ఆందోళనకు దిగారు. గ్యాస్ లీక్ ఘటనలో తమ గ్రామానికి చెందిన వారు చాలామంది చనిపోయారని, పశువులు కూడా మ‌ృత్యువాత పడ్డాయని,తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. అంతేకాకుండా, తమ ప్రాంతంలోని ఫ్యాక్టరీని మూసివేసి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గ్యాస్ లీక్ అయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు, గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పోలీసులను పరామర్శించేందుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫ్యాక్టరీ వద్దకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిశీలన అనంతరం ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళుతోన్న డీజీపీని స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేవరకు, ఫ్యాక్టరీ మూసేవరకు కదలబోమంటూ సవాంగ్ వాహనానికి అడ్డుతగిలారు. దీంతో, సవాంగ్ ఫ్యాక్టరీలోపలే చిక్కుకుపోయారు.

గ్యాస్ లీక్ అయిన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత డీజీపీ బయటకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేటు తెరవగా...ఆ గేటులో నుంచి ఆందోళనకారులు లోపలికి దూసుకువచ్చేందుకు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని పరిశ్రమ గేటు వద్దే మృతదేహాలతో ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సవాంగ్ ను డిమాండ్ చేశారు.

పోలీసులు నచ్చజెప్పినా శాంతించని ఆందోళనకారులు...గేటు వద్దే బైఠాయించడంతో డీజీపీ ఫ్యాక్టరీ లోపల చిక్కుకున్నారు. డీజీపీకి రక్షణగా పోలీసులు నిలిచి ఫ్యాక్టరీలోకి రాకుండా స్థానికులను అడ్డుకుంటున్నారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని పోలీసులు విజప్తి చేస్తున్నారు.