తిరుపతి ఎయిర్ పోర్టుకు తీపి కబురు

August 07, 2020

మోడీకి ముందున్న యూపీఏ హయాంలో కేంద్ర కాబినెట్ సమావేశం సాగిందంటే.. ఆసక్తికర విషయాలు చాలా బయటకు వచ్చేవి. ఐరన్ కర్టెన్లు మాదిరి వ్యవహరించే మోడీ సర్కారులో కాబినెట్ జరిగిందంటే జరిగిందన్న మాటే కానీ.. ఏం చర్చ జరిగింది? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికేవి. కొందరు నేతల పుణ్యమా అని.. సమావేశంలో సాగిన రసవత్తర సన్నివేశాలు కూడా బయటకు వచ్చేవి. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. తాను ఏ విషయాలైతే బయటకు చెప్పాలనుకుంటున్నారో అవి మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి. ఈ రోజు జరిగిన కేంద్ర కాబినెట్ లో ఏపీకి సంబంధించిన ఒక శుభవార్తను వెల్లడించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి ఎయిర్ పోర్టులో త్వరలోనే సరికొత్త వీఐపీ లాంజ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం 1800 చదరపు మీటర్ల భూమిని ఏపీ విద్య.. సంక్షేమ.. మౌలిక సదుపాయాల కార్పొరేషన్ కు కేటాయించేందుకు కాబినెట్ ఓకే చెప్పింది. ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో పదిహేనేళ్ల పాటు ఈ భూమిని కేటాయించాలని డిసైడ్ చేశారు. ఇందులోనే వీఐపీ లాంజ్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ నిర్ణయంతో పాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఆర్థిక సంఘం పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 15వ ఆర్థిక సంఘం పదవీ కాలాన్ని 2020 అక్టోబరు 30 వరకు పొడిగించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక మూలధనాన్ని రూ.10వేల కోట్లకు పెంచారు. గతంలో ఇది కేవలం రూ.3500 కోట్లు మాత్రమే ఉండేది. తాజా నిర్ణయంతో తిరుపతి ఎయిర్ పోర్టు రూపు రేఖల్లో మార్పులు రావటం ఖాయమని చెప్పక తప్పదు.