విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు , రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటం :

May 27, 2020

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన 9 సం. ల తర్వాత 1956 వ సంవత్సరం నవంబర్ 1 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది . 1965 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో చెప్పుకోదగ్గ పారిశ్రామిక ప్రగతి జరగలేదు . పరిశ్రమల ద్వారామాత్రమే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్న తరుణం లో “ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశం లో 5 వ భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని తలచింది . అప్పుడు ఉక్కు పరిశ్రమ ‘ఏర్పాటు కమిటీ ‘ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ను , కర్ణాటక లోని హోస్ పేట ను పరిశీలించి విశాఖపట్నం లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించమని ప్రతిపాదించింది . అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు . దురదృష్ట వశాత్తు 1966 జనవరి లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు అకస్మాత్తుగా మరణించారు , ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు .

అప్పటి కేంద్రం లోని అధికారపార్టీ రాజకీయ అవసరాల రీత్యా ‘ ఉక్కు కర్మాగారాన్ని ‘ వేరే రాష్ట్రం లో ఏర్పాటు చేయాలని నిశ్చయించారు . కేంద్ర ప్రభుత్వ నిర్ణయం “ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజలను కోపోద్రిక్తులను చేసింది “. కులమత ప్రాంతాల కతీతంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు . అప్పుడు ( ప్రస్తుత రాజధాని ‘అమరావతి’ ప్రాంతానికి చెందిన ) గుంటూరు జిల్లాలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ లోని దళిత నాయకుడు టి.అమృత రావు గారు ... 1966 అక్టోబర్ 14 తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు . నవంబర్ 1 వ తేదీన విశాఖపట్నం కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం గా మారి 9 ఏళ్ల బాలుడితో సహా , ‘9 ‘ మంది ప్రజలు పోలీస్ కాల్పులలో మరణించారు .
విశాఖ పట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు పోరాడారు .. ప్రాణత్యాగాలు చేశారు . ఆ సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమకారులపై పోలీస్ వారు జరిపిన కాల్పులలో విజయవాడ లో 5 గురు , గుంటూరు లో 5 గురు , విజయనగరం లో ఇద్దరు , కాకినాడ లో ఒకరు , తగరపు వలసలో ఒకరు , సీలేరు లో ఒకరు, ఆదిలాబాద్ లో ఒకరు , వరంగల్ లో ఒకరు చనిపోయారు . రాష్ట్రం మొత్తం మీద 32 మంది పోలీస్ కాల్పులలో చనిపోయారు.

“ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు “ అనే నినాదంతో ఉద్యమం లో పోరాడిన వారు , ప్రాణత్యాగం చేసిన వారు “ విశాఖపట్నం మనదే , మన రాష్ట్రానిదే అన్న భావన . విశాఖపట్నం లో ఉక్కు పరిశ్రమ వస్తే విశాఖపట్నం వాసులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అని అప్పుడు పోరాడిన వివిధ ప్రాంతాల ప్రజలందరికీ తెలుసు . అయినా అప్పటి ప్రజల భావన ఏమిటంటే “ విశాఖపట్నం లోని ప్రజలు కూడా మన వాళ్ళే కదా , అక్కడి పిల్లలు , యువకులు మన పిల్లలే కదా అని రాష్ట్ర ప్రజానీకం భావించింది . ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి వలన తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధిచెందుతుంది అని ప్రజలు బలంగా నమ్మారు “ . అవి విశాలహృదయంతో , సమతాభావంతో నిండిన అప్పటి ప్రజల మనస్సులోని ఉదాత్తమైన ఆలోచనలు .

విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన-ఏర్పాటులో ముఖ్యమైన తేదీలు :

1 . విశాఖ ఉక్కు సాధన కోసం “ అమృతరావు గారి ఆమరణ దీక్ష విరమణ - నవంబర్ 3 వ తేదీ 1966 . కేంద్ర ప్రభుత్వ హామీ - మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు.

2 . ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ - పార్లమెంటరీ ప్లీనరీ లో ఈ విధంగా చెప్పారు “ ఆంధ్ర ప్రదేశ్ కు ఏదైనా తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావించటం లేదని , ఉక్కు కర్మాగారం ఏర్పాటు నిధుల లభ్యత మీద ఆధారపడి ఉంటుంది “ .
3 . 1970 ఏప్రిల్ 17 వ తేదీన విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పార్లమెంటులో ప్రకటన చేశారు.

4 . 1971 జనవరి 20 న స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు.

5 . 1977 అక్టోబర్ లో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ అందిన తర్వాత “ జనతా ప్రభుత్వం “ 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది.

6 . 1981 లో ప్లాంటు నిర్మాణం కోసం రష్యాతో ఒప్పందం , 1982 జనవరి లో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది .

7 . 1990 లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది . మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభమయ్యింది .

క్లుప్తంగా - ‘ శంకుస్థాపన 1971 లో జరిగితే ... 1990 లో ఉక్కు ఉత్పత్తి మొదలయ్యింది . ఈ మధ్య కాలంలో కేంద్రంలో 4 గురు ప్రధానమంత్రులు మారారు , వివిధ పార్టీ లు అధికారం లోకి వచ్చాయి . రాష్ట్రంలో కూడా వివిధ పార్టీ లు , వివిధ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు . రాజకీయ అవసరాల కోసమో , ఇంకేదైనా కారణాలతోనో ఏ ఒక్కరు కూడా విశాఖ పట్నం లోని స్టీల్ ప్లాంట్ ను ఇంకొక ప్రాంతానికి మార్చాలనుకోలేదు .... కనీసం ఒక్క క్షణం కూడా ఇటువంటి ఆలోచన ఏ ప్రధానమంత్రికి గాని , ఏ ఒక్క ముఖ్యమంత్రికి కి గాని రాలేదు.

స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన భూసేకరణ :

విశాఖపట్నం లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకోసం మొత్తం 24 వేల ఎకరాల భూమి ని సేకరించారు . అప్పుడు ఆ ప్రాంతంలో ఎకరా పొలం యొక్క మార్కెట్ ధర సుమారు రూ. 2000 ( రెండువేల రూపాయలు మాత్రమే ). వారికి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇచ్చిన నష్టపరిహారం రూ. 17500 నుండి రూ. 20000 . అనగా మార్కెట్ ధరకన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ. ఇల్లు కోల్పోయిన వారికి... ఇంటిస్థలం మరియు ఇల్లు నిర్మించుకోవటానికి సహాయం చేశారు. భూసేకరణలో పొలం ఇచ్చిన కుటుంబాలకు “ R కార్డు లు ఇచ్చారు “ . ఆ కార్డు లు ఉన్న కుటుంబాలవారికి శిక్షణ ఇచ్చి , వివిధ పోస్టులలో వేలసంఖ్యలో శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఆయా కుటుంబాల వారు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం రావటం వలన గడచిన ౩౦ సంవత్సరాలలో ( జీతం రూపంలో ) వారికి అందిన డబ్బు - సుమారు 75 లక్షల రూపాయలు .
( సగటు నెల జీతం ౩౦౦౦౦ వేలుగా లెక్కించాము . వాస్తవానికి ఇప్పుడు 20 ఏళ్ల అనుభవం ఉన్న టెక్నీషియన్ కు నెల జీతం సుమారు 50 నుండి 60 వేలు ఉంది .) ఇప్పటికి కూడా ( 2019 లో కూడా) R కార్డు లుఉన్న కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు .
స్టీల్ ప్లాంట్ వలన విశాఖపట్నం లోని వారికి మాత్రమే లాభం జరిగిందని , పొలం ఇచ్చిన కుటుంబాలకు మాత్రమే చాలా ఎక్కువగా లాభం జరిగిందని ... విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబాలవారు ఒక్కరైనా భావించారా ? ఉద్యమం లో పోరాడిన వారి మనస్సులో ఉన్నది “ విశాఖపట్నం మన అందరిది , అందులో పనిచేయబోయేవారందరూ మనవాళ్లే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావించారు” .

అమరావతి పరిరక్షణ ఉద్యమం :

2014 లో ‘ప్రాంతీయ తత్వం - తెలంగాణ వెనుకబాటు’ అనే అంశాల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది . “ విజయవాడ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలని 2014 సెప్టెంబర్ 4 వ తేదీన అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది “ .తదుపరి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 34 వేల ఎకరాలను , 29 వేల రైతుకుటుంబాల నుండి సమీకరించి రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు . రాజధాని ప్రాంత ప్రజలకు ... 1 కి పావలా వంతు భూమి మాత్రమే అభివృద్ధిచేసి ఇవ్వటం , 10 సంవత్సరాల కౌలు మాత్రమే ఇవ్వటం అనే నిబంధనలు మాత్రమే ఉన్నాయి . వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూమి సేకరణ చేసినప్పుడు ఇచ్చినట్లుగా , రాజధాని రైతులకు మార్కెట్ రేటు కన్నా 8 నుండి పది రెట్లు పరిహారం ఇవ్వలేదు , శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటంలేదు . ( వైజాగ్ లో వలే భూసేకరణకు పరిహారం ఇవ్వాలంటే ... రాష్ట్రప్రభుత్వం రాజధానిలో రైతులకు ఎకరాకు 1 కోటి రూపాయలనుండి 10 కోట్ల రూపాయలు చెల్లించాలి ) .

1960 - 1980 లలోని ప్రజల మనస్తత్వానికి , ఇప్పటి ప్రజల మనస్తత్వానికి స్పష్టమైన తేడా ఉంది. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంత ప్రజలు .. విశాఖపట్నం మనదే అని , స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలొచ్చిన విశాఖపట్నం యువకులు కూడా మనవాళ్లే అని అనుకున్నారు .
గడచిన 20 సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆలోచనా తీరు బాగా మారింది . కులం- ప్రాంతీయతత్వం బాగా పెరిగింది ... ముఖ్యంగా చదువుకున్న వారిలో “ ఈ కుత్సిత బుద్ధి “ చాలా ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ , సామాజిక మాధ్యమాలు పెరిగిన తర్వాత .... కొన్ని కులసంఘాలు , కొన్ని రాజకీయ పార్టీ లు దీనిని పెంచి పోషించాయి . ఒక రాజకీయ పార్టీ వారి గెలుపు కోసం .... అరువు తెచ్చుకున్న ఒక రాజకీయ వ్యూహకర్త .. తన “ కుల చాణిక్య యుక్తి “ ని ప్రజల మనస్సులోకి చొప్పించి , కులాల మధ్య కులద్వేషాన్ని రగిల్చాడు . ఒకరి మీద ఒకరు ఎంతగా ద్వేషాన్ని పెంచుకునేటట్లు చేసాడంటే ... అన్ని కులాల వారు, ప్రాంతాల వారు కలిసి మునిగిపోతున్నా కూడా కలిసికట్టుగా పనిచేయడానికి, దగ్గరకు రాలేనంతగా ద్వేషించుకుంటున్నారు .

ఈ పరిస్థితులలో ద్వేష భావం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు “ 5 సంవత్సరాల క్రితం 34 వేల ఎకరాలు భూసమీకరణ చేసి , కొత్తగా నిర్మించిన భవనాలలో 3 సంవత్సరాలనుండి అమరావతి లో ఉన్న సచివాలయాన్ని , అసెంబ్లీ ని , ఒక సంవత్సరం నుండి పనిచేస్తున్న హైకోర్టు ను ... వేరు వేరు ప్రాంతాలలోకి ముక్కలుగా చేసి మూడు వైపులకు వెయ్యటానికి నిర్ణయించారు .

ఒక స్టీల్ ప్లాంట్ కట్టటానికి కేంద్ర ప్రభుత్వానికి 20 సంవత్సరాలు పట్టింది ... ఆ 20 ఏళ్లలో ప్రభుత్వాలు .. పార్టీ లు మారినా ఎవ్వరూ స్టీల్ ప్లాంట్ ను తమ ప్రాంతానికి తరలిస్తామని చెప్పలేదు . కారణం పార్టీ లు మారినా, ప్రధానమంత్రులు మారినా, ముఖ్యమంత్రులు మారినా కూడా ప్రభుత్వ నిర్ణయం మారలేదు. ఎందుకంటే .. ప్రభుత్వం అంటే ఒక నమ్మకం . ప్రజలలో ఆ నమ్మకాన్ని పోగెడితే ..ప్రజాస్వామ్యం పైనే నమ్మకం పోతుందని .

దురదృష్టవశాత్తు ఇప్పటి “ ప్రభుత్వానికి ముందుచూపు లేదు . ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదు. “ . ప్రస్తుత మేధావులకు ధైర్యం , నిస్పాక్షికత లేవు .

ఈ ప్రభుత్వ మూడు రాజధానుల ఏర్పాటు చర్య ... రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తుందో ??
( తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ... 3 రాజధానులు భేష్ అని మెచ్చుకొని, ముందుకెళ్ళమని సలహా ఇచ్చారంటా .... అసలు తెలంగాణా ఉద్యమం జరిగిందే “ తెలంగాణ వెనుకబడిందని “.... మరి ఆయన తెలంగాణ లోని వెనుకబడిన ప్రాంతాలలో ‘ 3 ‘ రాజధానులు లేక ‘6 ‘ రాజధానులు ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారో అని అడిగే ధైర్యం - ఆలోచన ... ఇక్కడి మేధావులకు , మీడియా కు లేదు ) .

‘ మనం ఇంగితజ్ఞానం కూడా కోల్పోయామా ?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి .

34 వేల ఎకరాలను 29 వేల రైతుకుటుంబాల నుండి సమీకరించిన ప్రభుత్వం , వారితో చట్టబద్ధ ఒప్పందం చేసుకున్న తర్వాత ( లక్ష కోట్లకు పైగా అపరాధ రుసుము చెల్లంచల్సివస్తుందని తెలిసికూడా ) సుమారు 10000 కోట్లు ప్రజాధనం ఖర్చుబెట్టిన తర్వాత , ఎన్నో కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీ లు ఒప్పందాలు చేసుకున్న తర్వాత ... రాజధానిని మారిస్తే “ రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం పై నమ్మకముంటుందా ? కంపెనీలు ఇకముందెప్పుడైనా మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టటానికి వస్తాయా ? “ . ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోయాక “ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా ?” .

ప్రజలు , మీడియా , మేధావులు ఈ విషయాలపై కూలంకషంగా ఆలోచించి ... తమ పార్టీ అభిమానాలను పక్కన పెట్టి ... కుల ప్రాంత భావాలను ధాటి .. విశాల మనస్సుతో , విస్తృతమైన ఉదాత్తమైన లక్ష్యం కోసం , రాష్ట్ర శ్రేయస్సుకోసం మనమంతా కలిసికట్టుగా ఉద్యమించి “ రాష్ట్ర రాజధాని అమరావతిని కాపాడుకోవాలి “. అప్పుడే “ విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రాంతాలకతీతంగా ప్రాణత్యాగం చేసిన వారికి నిజమైన నివాళి “.

--డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి

RELATED ARTICLES

  • No related artciles found