Visakhapatnam - జగన్ అప్పుడలా, ఇప్పుడిలా

June 04, 2020

విశాఖపట్నం గ్యాస్ లీక్ బాధితుల కుటుంబాల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్వర పరిహారం ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతవరకు అన్ని కంపెనీల్లో నిర్లక్ష్యం వహించిన ఈయన ఇపుడు ఇంత ఉత్సాహం ప్రకటించడం వెనుక మతలబు ఏంటి? దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతులకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. మిగతా బాధితులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. అయితే.. పదకొండు మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుని వందల మందిని ఆసుపత్రి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ గురించి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా చేయకపోవడం.. వారి పట్ల ఎంతమాత్రం ఆగ్రహం ప్రకటించకపోవడం మాత్రం విమర్శలకు దారి తీసింది.

ఎల్జీ లాంటి మల్టీనేషనల్ కంపెనీ అంటూ దాని స్థాయి పెంచే ప్రయత్నం చేశారాయన. నష్టపరిహారంలో వాళ్ల నుంచి ఎంత రాబడతామో ప్రభుత్వ పరంగా కిందా మీదా పడతాం అంటూ ఒక బేల కామెంట్ చేశారు ఏపీ సీఎం. ఈ ఘోరానికి కారణమైన కంపెనీపై సీఎం కనీసం ఆగ్రహం వ్యక్తం చేయకపోవడం, వాళ్లపై చర్యలుంటాయని ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఈ సందర్భంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ఓఎన్జీసీ గ్యాస్ లీక్ జరిగి ప్రాణ నష్టం జరిగినపుడు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించడాన్ని జగన్ ఆక్షేపించారు.

కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. అది కూడా కంపెనీ నుంచే పూర్తిగా ఇప్పించాలని.. విదేశాల్లో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నపుడు  సదరు కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయని.. వాటిని ఉదాహరణగా తీసుకుని మన దగ్గరా చర్యలు ఉండాలని.. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా కంపెనీలు భయపడేలా చేయాలని జగన్ తీవ్ర స్వరంతో అన్నారు.

కానీ ఇప్పుడు చూస్తే విశాఖలో దారుణానికి కారణమైన కంపెనీని పల్లెత్తు మాట అనకుండా.. కంపెనీ నుంచి పరిహారం రాబట్టేందుకు కిందా మీదా పడతాం అనడం ఆశ్చర్యం కలిగించే విషయం.

జగన్ ద్వంద ప్రమాణాలకు ఈ వీడియో నిలువెత్తు సాక్ష్యం

video link : https://twitter.com/i/status/1258682596105609216