Visakhapatnam - కన్నీరు తెప్పించిన కవిత్వం

May 27, 2020

ఒక రచయిత విశాఖ సంఘటన గురించి తన మనోవేదనను హృద్యంగా వెల్లడించారు.. అందరినీ ఆకట్టుకుంటున్న కవిత మీకోసం.

రాత్రి గూటికిచేరిన పక్షులు
సూర్యోదయం చూడలేకపోయాయి
కళ్లు తెరవకుండానే కాలకూటం కమ్మేసింది

రాత్రి కళ్ళల్లో నిక్షిప్తమైన భావచిత్రాలు
తెల్లారేసరికి ఛిద్రమైనాయి

నిన్న పూసిన పువ్వు నేడు మాడిపోయింది
నిన్న కాసిన కాయ నేడు కమిలి పోయింది

ఏం పుట్టిందో ఎలా పాడైందో
మాయదారి విషం కమ్మేసింది
భూకంపాలు పసిగట్టే కుక్క
రాత్రంతా కాపలా కాసి
మొరగక నిస్సత్తువతో తూలిపడిపోయింది

రేయి మెడకి పలుపు తాడు
బిగిస్తున్నప్పుడు ఆప్యాయంగా అంబా
అని అరచిన పశువు నిర్జీవమైంది

తెల్లారి కూసే కోడి కొక్కరోకో అనకనే
కిక్కురమనకుండా వాలిపోయింది

కొమ్మల మధ్య తారాడుతున్న కోయిలమ్మ పాట మూగబోయింది

దారిపొడవునా మూగజీవాల కళేబరాలు
మురుగుకాలువల్లో మృతజీవులు
పాపమెవరు మూటగట్టుకున్నా పోయిన ప్రాణాలకు బాధ్యులెవరు???

భోపాల్ నుండి విశాఖ వరకు నేర్చుకున్న పాఠాలు లేవు
పరిహారమో సంహారమో తేల్చుకొనే తరుణమెప్పుడు????

- రాజేష్ గౌడ్, కవి, జర్నలిస్టు (వాట్సప్ నుంచి స్వీకరించిన కవిత )