విశాఖపట్నం గ్యాస్ ట్రాజెడీ- ​వైజాగ్ నుంచి భారీ వలసలు​

June 02, 2020

విశాఖపట్నం ప్రజలకు పెద్ద కష్టం వచ్చింది. అసలే కరోనా భయంతో బయట అన్నీ బంద్. బయటకు వెళ్తే కరోనా అంటుకుంటుంది అన్న భయం. కానీ ఉన్నచోట ఉంటే గ్యాస్ చంపేస్తుందని మరో భయం. కరోనా వస్తే 97 శాతం బతికే ఛాన్స్ ఉంది. కానీ గ్యాస్ చావొచ్చు. క్యాన్సర్ రావచ్చు. ఇంకే ఘోరమో జరగొచ్చు. ఎందుకు ఈ బాధలు... దీనికంటే కరోనా పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటూ విలువైన వస్తువులు, లగేజీ తీసుకుని విశాఖపట్నం ప్రజలు శ్రీకాకుళం, విజయనగరం వైపు వలసలు పోతున్నారు. 

విషాదకరమైన విషయం ఏంటంటే... విశాఖలో వారి కష్టం తెలిసి కూడా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. పైడి భీమవరం చెక్ పోస్టు వద్ద కార్లు, ద్విచక్రవాహనాలు అన్నీ ఆపేస్తున్నారు. ఈ వలపోయేవారిలో అత్యధికులు ఎల్జీ పాలిమర్స్ కు ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారే. బాబూ ... గ్యాస్ లీకేజీ ఇళ్లలో ఉండలేము. బంధువుల వద్దుక పోతాం అని చెప్పినా కూడా పోలీసులు వినడం లేదు. అయితే... క్వారంటైన్లో ఉంటే పంపిస్తాం అని చెబుతున్నారు. కానీ గట్టిగా నిలదీస్తే ఈ సమాధానం చెబుతున్నారు. గట్టిగా అడగని వారిని ఉత్తినే వెనక్కు పంపేస్తున్నారు. గవర్నమెంటు ఆదుకోదు. మా జాగ్రత్త మమ్మల్ని తీసుకోనివ్వదు. ఇదేం కర్మరా దేవుడా అంటూ వారు వాపోతున్నారు. 

ఇదిలా ఉంటే... ఎల్జీ పాలిమర్స్ మృతుల సంఖ్య 12కి పెరిగింది. నిన్న అర్ధరాత్రి మరోసారి గ్యాస్ లీకవడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. విచారకరం ఏంటంటే... స్వల్ప అస్వస్థత ఉన్నవారిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి చికిత్స అందిస్తున్నారు. కానీ బంధువులకు సరిగా సమాచారం చేరవేయకపోవడంతో తమ వాళ్లు ఎక్కడున్నారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు.