visakhapatnam: వైజాగ్ కనిపించినంత సేఫ్ కాదా?

August 04, 2020

విశాఖపట్టణం... సాగర నగరంగా, పర్యాటకానికి పుట్టిల్లులా కనిపించే నగరం. ఓ వైపు కనుచూపు మేర సముద్ర తీరం.. మిగిలిన మూడు వైపులా దట్టమైన కొండలు కలిగిన విశాఖ... నిజంగానే పర్యాటకానికి పెట్టింది పేరే. ఒక్క తుఫాన్లు మినహా మిగిలిన ఏ ప్రకృతి వైపరీత్యమూ ఈ నగరాన్ని తాకే అవకాశాలే లేవన్న మాట గట్టిగానే వినిపించేది. మొత్తంగా ప్రకృతి అందాలతో అలరారే విశాఖ సుఖమయ జీవనానికి కేరాఫ్ అడ్రెస్. అందుకే కాబోలు వివిధ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు విశాఖనే తమ హోం సిటీగా ఎంచుకోవడానికి ఇష్టపపడేవారు. అయితే పరిస్థితులు మారాయి. విశాఖ సేఫ్ సిటీ అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు విశాఖ ఎంతమాత్రమూ సురక్షితమైన నగరంగా చెప్పడానికి వీల్లేదు. విశాఖ డేంజరస్ సిటీగా మారిపోయింది. పర్యాటకంతో పాటు పరిశ్రమలు కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నేపథ్యంలోనే విశాఖ తలరాత మారిపోయిందని కూడా చెప్పక తప్పదు. 

అదేదో... గురువారం నాడు తెల్లవారుజామున విశాఖ పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టిరీన్ వాయువు విడుదలై 11 మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటుగా వెయ్యి మందికి పైగా ప్రజలు ఆసుపత్రిపాలయ్యారని ఈ విషయం చెప్పడం లేదు. విశాఖ నగరంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను పరిశీలించాకే విశాఖ డేంజర్ సిటీనేనని చెప్పాల్సి వస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో సదరు కంపెనీ నుంచి విడుదలైన స్టిరీన్ వాయువు విశాఖ నుంచి బయటకు వెళ్లే దారి లేకనే ప్రజలను పొట్టనపెట్టుకుంది. మూడు వైపులా కొండలు ఉన్న విశాఖలో ఏ వాయువు లీకైనా కూడా అది బయటకు వెళ్లాలంటే చాలా సమయమే పడుతుంది. అంటే... విశాఖను మూడు వైపులా కొండలు కప్పేశాయి. మరి స్టిరీనే కాకుండా ఏ విష వాయువు అయినా లీకైతే... అది బయటకు వెళ్లదు. నగరంలోని జనంపైనే ముందుగా దాడి చేస్తుంది. ఈ కారణంగానే గురువారం నాడు ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన స్టిరన్ విశాఖ వాసులను చుట్టేసింది. ప్రాణాలు తీసింది.

మొత్తంగా గురువారం నాటి ఘటన విశాఖకు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. మొన్నటిదాకా టూరిస్ట్ హాట్ డెస్టినేషన్ గానే ఉన్న విశాఖ...ఇటీవలి కాలంలో పారిశ్రామికంగానూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. లెక్కలేనన్ని పరిశ్రమలు వచ్చి చేరాయి. నగరం కూడా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అప్పుడెప్పుడో నగరం బయట ఏర్పాటైన పరిశ్రమలు ఇప్పుడు నగరంలోకి వచ్చేసినట్టే. దీంతో ఎల్జీ పాలిమర్స్ లాగానే... ఏ పరిశ్రమ నుంచి ఏ విష వాయువు లీకైనా.. విశాఖ వాసులకు ఇబ్బంది తప్పదు. రసాయన పరిశ్రమల హబ్ గా పరిగణిస్తున్న మెడ్ టెక్ జోన్ కూడా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తే... విశాఖకు మరింత ముప్పు పొంచి ఉందనే చెప్పక తప్పదు. ఈ లెక్కన విశాఖ మరింత డేంజర్ నగరంగా మారిపోయిందనే చెప్పాలి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే... తాజాగా విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు కంకణం కట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ పార్లమెంటరీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఓ భారీ గ్యాంగే విశాఖలో తిష్ట వేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దందాలు, బలవంతపు వసూళ్లకు ఈ గ్యాంగ్ అప్పుడే తెర లేపిన వైనం కూడా తెలుస్తున్నదే. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఇప్పడు ఈ గ్యాంగ్ కారణంగా ఓ రేంజిలో దాడులు, బెదిరింపులు, భూకబ్జాలు యథేచ్ఛగా సాగుతున్న వైనంపై కూడా విశాఖ వాసుల్లో ఆందోళన రేకెత్తుతోంది. మొత్తంగా ఓ వైపు పరిశ్రమలు, మరోవైపు దాడులకు తెగబడుతున్న గ్యాంగ్ ల కారణంగా విశాఖ ఇంకెంత మాత్రం సేఫ్ సిటీ అని చెప్పడానికి వీల్లేదన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఈ ఉపద్రవాల నుంచి విశాఖను, విశాఖ వాసులను ఏ దేవుకు రక్షిస్తాడో చూడాలి.