డీజీపీని కోర్టు మెట్లెక్కిచ్చిన జగన్ పాలన

June 01, 2020

ఏపీలో పోలీసు పరిస్థితి దైన్యంగా ఉంది. తటస్థంగా ఉంటే బదిలీలు, డిమోషన్లు, ఒత్తిడులు. నిజాయితీగా ఉన్నవాళ్లు అయితే లీవు పెట్టాలి లేకపోతే ఒత్తిళ్లకు లొంగాలి. వైసీపీ కార్యకర్త మీద చేయిపడితే ఊరుకునేది లేదు అంటూ పోలీసులు మౌఖిక ఆదేశాలు అందాయని టీడీపీ ఆరోపిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, కత్తిపోట్లు, హత్యాయత్నాలు జరుగుతున్నా దేనినీ ఆపలేకపోతున్నారు పోలీసులు. నిన్నటి మాచర్ల సంఘటన అయితే ఏపీ పోలీసులు పరువు తీసింది. జాతీయ మీడియా వైసీపీ గూన్స్ అంటూ రాసి ఏపీలో అరాచకాలను చిత్రీకరించింది.

చివరకు డీజీపీయే చేతులెత్తేసే పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడు పోలీసు అనుమతి తీసుకుని వైజాగ్ లో పర్యటించడానికి వెళ్తే... వైసీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని అడ్డుకున్నారు. అనుమతితో వస్తే అడ్డుకుంటారా అని చంద్రబాబు నిలదీస్తే మీ భద్రత కోసమే అరెస్టు చేస్తున్నాం అంటూ మాయచేసి పర్యటన చేయకుండా వెనక్కుపంపారు. ఈ ఘటనపై టీడీపీ కోర్టుకి పోయింది. వారి పిటిషను విచారించిన కోర్టు ప్రభుత్వానికి డీజీపీకి చీవాట్లు పెట్టింది. ఇదేం ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా అంటూ పోలీసులను తిట్టింది. డీజీపీ సరైన వివరణతో కోర్టుకు రావాలంటే ఆదేశించడంతో గురువారం డీజీపీ హైకోర్టుకు వెళ్లారు. కోర్టులో దీనిపై ఈరోజు విచారణ జరిగింది.

జగన్ తన కక్షపూరిత చర్యల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల పోలీసులు ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తప్పు చేయకపోతే ఈరోజు డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరమే వచ్చేది కాదు. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న విషయంలో పోలీసులు కోర్టు నుంచి తప్పించుకోలేరు. దీనిపై తీవ్రమైన చర్యలు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తానికి జగన్ తన తండ్రి హయాంలో ఐఏఎస్ లను తన వల్ల జైలుకు పంపే పరిస్థితి తెచ్చారు. ఇపుడు సీఎం అయ్యాక డీజీపీని కోర్టుల చుట్టు తిప్పుతున్నారు.