ట్రావెల్స్ ఇన్సురెన్స్ త‌ప్ప‌నిస‌రి...తేల్చిచెప్పిన‌ దుబాయ్ ఇండియ‌న్ కాన్సులెట్‌

August 07, 2020

భార‌త‌దేశానికి చెందిన సంద‌ర్శ‌కులు దుబాయ్‌ని వీక్షించేందుకు వ‌స్తున్న స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ట్రావెల్ ఇన్సురెన్స్ క‌లిగి ఉండాల‌ని దుబాయ్‌లోని ఇండియ‌న్ కాన్సులెట్ తేల్చిచెప్పింది. భార‌త కాన్సులెట్ అధికారులు ట్విట్ట‌ర్‌లో ఈ మేర‌కు ప‌లు ఆదేశాలు, స‌మాచారాన్ని పోస్ట్ చేశారు. ``అనూహ్య‌మైన వైద్య ఖ‌ర్చులు మ‌రియు స్వ‌దేశానికి తిరిగి వెళ్లే ప్రక్రియ‌లో ఇబ్బందులు ఎదుర్కుంటున్నందున త‌మ‌కు స‌హాయం చేయాల‌ని యూఏఈని సంద‌ర్శించే భార‌తీయుల నుంచి ప‌లు సందర్భాల్లో విన‌తులు వ‌స్తున్నాయి`` అని పేర్కొంది. ఇలాంటి సంద‌ర్భాల్లో తాము భార‌త ప్ర‌భుత్వం స‌హాయంతో త‌గు భ‌రోసా అందిస్తున్న‌ట్లు పేర్కొంది. అయితే, తాము చేసే స‌హాయం వారికి సంబంధించిన అన్ని అవ‌స‌రాల‌ను తీర్చ‌లేక‌పోతోంద‌ని వివ‌రించింది.

స్వ‌దేశంలో మెడిక‌ల్ ఇన్సురెన్స్ లేనందున అనేక మంది ప్ర‌జ‌లు అంత‌ర్జాతీయంగా ప్ర‌యాణించే స‌మ‌యంలో కూడా అదే రీతిలో ఉండిపోతున్నార‌ని పేర్కొంది. అయితే, స‌ద‌రు వ్య‌క్తి ప్ర‌యాణంలో అనారోగ్యానికి గురైనా, యాక్సిడెంట్ బారిన ప‌డినా లేదా ఏవైనా అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు పొందాల్సి ఉన్నా అత్య‌వ‌స‌ర ట్రాన్స్‌పోర్టేష‌న్ లేదా మ‌రే రూపంలో అయినా స్వ‌దేశానికి చేర్చాల్సి ఉంటుంద‌ని ఇలాంటి త‌రుణంలో సంబంధిత ఖ‌ర్చుల‌ను ఆ వ్య‌క్తి కుటుంబమే భ‌రించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల్లో కంటే అధికంగా దుబాయ్‌లో వైద్య ఖ‌ర్చులు ఉంటాయ‌ని ఈ సంద‌ర్భంగా కాన్సులెట్ వెల్ల‌డించింది.

ఈ సంద‌ర్భంగా ట్రావెల్ ఇన్సురెన్స్ వెబ్‌సైట్ విజిట‌ర్స్‌క‌వ‌రేజ్‌.కామ్ సీఈఓ రాజీవ్ శ్రీ‌వాస్త‌వ మాట్లాడుతూ, ``ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంద‌ర్శ‌కుల సంఖ్య ఏ విధంగా అయితే పెరిగిపోతోందో అనారోగ్యం బారిన ప‌డుతున్న వారి సంఖ్య సైతం అదే రీతిలో పెరుగుతోంది`` అని పేర్కొన్నారు. ``దుబాయ్‌లోని భార‌త కాన్సులెట్ చేసిన సూచ‌న‌ల యొక్క అర్థం ప్ర‌యాణ బీమా గురించి మ‌రోమారు సంద‌ర్శ‌కుల‌కు నొక్కి చెప్తోంది. ప్ర‌యాణికులు త‌మ ఇంటి నుంచి బ‌య‌ల్దేరే స‌మ‌యంలోనే ప్ర‌యాణం, ఆరోగ్యం, ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇన్సురెన్స్ తీసుకోవ‌డం ఉత్త‌మం`` అని స్ప‌ష్టం చేశారు.స‌మ‌గ్రమైన ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రావెల్‌ ఇన్సురెన్స్  ప్లాన్ ద్వారా కేవ‌లం ఆరోగ్య‌సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఎదురైన స‌మ‌యంలో స‌హాయం పొంద‌డం మాత్ర‌మే కాకుండా, ప్ర‌యాణంలో ఎదుర‌య్యే ఇబ్బందులైన ల‌గేజ్ మ‌రియు పాస్‌పోర్ట్ స‌మ‌స్య‌లు, ట్రిప్ డిలే, మిస్డ్ క‌నెక్ష‌న్ మ‌రియు క్యాన్స‌లేష‌న్ వంటి స‌మ‌యాల్లో సైతం స‌హాయం పొంద‌వ‌చ్చు.