వివేకా హత్యకు 13 నెలలు!

August 03, 2020

3 సిట్‌లతోనూ వీడని మిస్టరీ
విపక్షంలో ఉండగా సీబీఐకి
అప్పగించాలని జగన్‌ డిమాండ్‌
సీఎం అయ్యాక మారిన వైఖరి
దర్యాప్తు తీరుపై కుటుంబ సభ్యుల అనుమానం
సీబీఐకి అప్పగించి షాకిచ్చిన హైకోర్టు

సరిగ్గా 13 నెలల కిందట.. అప్పుడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. రాష్ట్రమంతా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ రాజకీయాగ్నికి మరింత ఆజ్యం పోస్తూ, రాష్ట్రాన్ని కుదిపివేసే సంఘటన... కడప జిల్లా పులివెందులలో జరిగింది! అది.. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య! 2019 మార్చి 15వ తేదీ రాత్రి తన స్వగృహంలోనే ఆయన హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ హత్య కేసు దర్యాప్తు పలు మలుపులు తిరిగింది. హత్య జరిగిన వెంటనే దర్యాప్తు కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘సిట్‌’ను నియమించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐకి ఇవ్వనక్కర్లేదని కోర్టులో వాదించారు. కానీ మూడు సిట్‌లు నియమించినా ఒక్క నిందితుడు కూడా అరెస్టు కాకపోవడంతో.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు జగన్‌కు గట్టి షాకిచ్చింది.
కుమార్తె పోరాటం...
వివేకా హత్య జరిగిన వెంటనే.. ‘గుండెపోటు’తో మరణించారని తొలుత జగన్‌ మీడియా ప్రచారం చేసింది. కానీ రక్తపు మరకలను తుడిచేయడం, కుటుంబ సభ్యులు రాకమునుపే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంవంటి అనేక ‘అనుమానాస్పద’ చర్యలన్నీ బయటకు రావడంతో చంద్రబాబే ఈ హత్య చేయించారని జగన్‌ అడ్డగోలు ఆరోపణలు చేశారు. దీంతో తొలుత అప్పటి సీఎం చంద్రబాబు నాటి సీఐడీ అదనపు డీజీ అమిత గార్గ్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించారు. జగన్‌ గద్దెనెక్కాక కడప ఎస్పీగా అభిషేక్‌ మహంతిని నియమించారు. ఆయన నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు కొనసాగింది. విచారణ కొలిక్కి వస్తున్న తరుణంలో మహంతి దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబరు 11న కడప ఎస్పీగా కేకేఎన అన్బురాజనను నియమించారు. ఆయన నేతృత్వంలో మూడో సిట్‌ను ప్రభుత్వం నియమించింది. నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చారని, కడపకు కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత దర్యాప్తు నత్తనడకన సాగుతోందని తెలిపారు. అమాయకులను ఇరికించి అసలైన  నేరస్తులను వదిలేస్తారేమోనన్న సందేహం వెలిబుచ్చారు. ఫలానా వారిపై తమకు అనుమానాలున్నాయని పలువురి పేర్లు, వారిపై ఉన్న అనుమానాలను కూడా హైకోర్టుకు వివరించారు. కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పనిలోపనిగా తమ ప్రాణాలకు కూడా ముప్పుందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయా ఫిర్యాదులను విచారించిన న్యాయస్థానం సీబీఐకి కేసును అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
నైతిక బాధ్యత సీఎంపైనే!
‘మృతుడు వివేకానందరెడ్డి ముఖ్యమంత్రికి బాబాయి. ఈ హత్య కేసులో నేరగాళ్లను పట్టుకుని సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూడాల్సిన నైతిక బాధ్యత సీఎంపై ఉంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివేకా హత్య జరిగిన కొన్నాళ్లకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ జగన ప్రతిపక్ష నేతగా పిటిషన దాఖలు చేశారని, ఇప్పుడు ఆ పిటిషనపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని సీఎంగా కోర్టులో మెమో దాఖలు చేశారని పేర్కొంది. నిష్పాక్షిక దర్యాప్తునకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన కోర్టుకు తెలిపేందుకు ప్రయత్నించారని, అయితే ఇప్పుడు ఆ హామీ ఇచ్చినంత మాత్రాన సరిపోదని తేల్చిచెప్పింది. ఈ దర్యాప్తు తుదిదశకు చేరేంత వరకు నైతిక బాధ్యత ఆయన వదులుకోరాదని సూచించింది. ‘ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ సీఎం మెమో దాఖలు చేసేనాటికి దర్యాప్తు సంస్థ ఆయన నియంత్రణలోనే ఉంది. అయినా హత్య కేసుతో ప్రత్యక్ష సంబంధమున్న ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదనేది కఠోర సత్యం. మెమో దాఖలు అంశాన్ని సీఎం విజ్ఞతకే వదిలి వేస్తున్నాం. గత ఏడాది మార్చి 15వ తేదీన అదనపు డీజీపీ అమిత గార్గ్‌ నేతృత్వంలో మొదటి సిట్‌ ఏర్పాటైంది. రెండో సిట్‌లో ఆయనకు ఎందుకు చోటు కల్పించలేదు? హత్యాస్థలిలో సాక్ష్యాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందే. ఘటనాస్థలిలో పడిఉన్న మృతదేహాన్ని కదల్చకుండా చూడాల్సిన వారు.. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం బాత్రూం నుంచి పడక గదికి మార్చారు. మృతదేహంపై రక్తపు మరకల్ని తుడిచి, బ్యాండేజ్‌ కట్టారు. పోలీసులు సైతం సాక్ష్యాల సేకరణపై సక్తి చూపలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఘటనా స్థలిలో శవ పంచనామా చేపట్టకుండా పులివెందుల ఆస్పత్రికి తరలించడాన్ని తప్పుబట్టారు. పులివెందుల పోలీసు స్టేషన్‌ నుంచే దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.