విశాఖకు ఏమైంది? ఎందుకు వరసగా... ఈసారి 10 మంది మృతి

August 12, 2020

ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న ప్రమాదాలు విశాఖవాసుల్ని వణికిస్తున్నాయి. ప్రమాదాల పరంపరలో మరో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ క్రేన్ కూలిన ఉదంతంలో పది మంది దుర్మరణం పాలు కావటం షాకింగ్ గా మారింది. హిందూస్తాన్ షిప్ యార్డులో చోటు చేసుకున్న ఈ ప్రమాదం అనూహ్యంగా చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

క్రేన్ ద్వారా లోడింగ్ పనులు జరుగుతున్నాయి. దీన్ని పరిశీలిస్తున్న సమయంలో భారీ క్రేన్ కుప్పకూలింది. పెద్ద శబ్దంతో కుప్పకూలిన క్రేన్ ధాటికి అక్కడే ఉన్న కార్మికుల మీద పడింది. దీంతో.. అక్కడికక్కడే ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు అనంతరం మరణించారు. ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఘటనకు కారణాల్ని విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. బాధితులకు సాయం అందించేందుకు షిప్ యార్డుకు చెందిన రక్షణ సిబ్బంది శ్రమిస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు విశాఖ వాసుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.