వైజాగ్ క్యాపిటల్... ఎందుకు మార్చారో చెప్పిన బాబు

February 21, 2020

అయిదు కోట్ల ఆంధ్రుల ప్రజారాజధానిని నాశనం చేసి వైజాగ్ కు రాజధానిని తరలించడం వెనుక వైసీపీ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. వైజాగ్ లో పెద్ద ఎత్తున భూములు కొన్న తర్వాత అక్కడ రాజధానిని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేడానికి జగన్, విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఒక రాజధాని కట్టడానికి డబ్బుల్లేవని చెప్పిన వీళ్లు ... మూడు రాజధానులు ఎలా కట్టగలరని చంద్రబాబు ప్రశ్నించారు. కేవలం వీరి వ్యాపారం కోసం మాత్రమే వైజాగ్ కు మార్చారని టీడీపీ అధినేత ఆరోపణలు చేశారు.

ఒకవైపు హైపవర్ కమిటీలు వేస్తారు. మరోవైపు బీసీజీ నివేదిక ఇంకా రాలేదు. అయినా.. వైజాగ్ రాజధాని అని మంత్రులు, ఎంపీలు ప్రకటిస్తున్నారు. వీళ్లు పద్ధతి ప్రకారం చేసేవాళ్లు అయితే, రాష్ట్రం కోసం చేసేవాళ్లు అయితే నివేదిక ఏం చెబితే అలా చేసేవాళ్లు. కానీ... వీరి ఇష్టానుసారం నిర్ణయాలు ప్రకటించి వాటిని నివేదికలుగా రాయించుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆనాడు అసెంబ్లీలో ఒప్పుకుని ఈరోజు ప్రజలను మోసం చేసి రాజధాని మారుస్తున్నారు. అమరావతి ప్రజారాజధాని, వైజాగ్ వైసీపీ రియల్ ఎస్టేట్ రాజధాని. వైసీపీ వాళ్లు వైజాగ్ ను అభివృద్ధి చేయరు. లూటీ చేస్తారు అని చంద్రబాబు సంచలన విమర్శలు చేశారు.

వైసీపీ నేతలకు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలియకుండానే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేసులు పెట్టి విచారణ చేసుకోమని సవాల్ చేస్తే పారిపోతున్నారు. జగన్ తుగ్లక్ అని దేశమంతా గుర్తించింది. జాతీయ మీడియా జగన్ పాలనపై విమర్శలు చేస్తోంది. అయినా వీరికి బుద్ధిరావడం లేదు. అమరావతిపై రోజుకో రకమైన విమర్శలు చేస్తున్నారు. అమరావతి ముంపు అంటున్నారు. అది ముంపునకు గురయ్యే అవకాశం లేదని టెక్నికల్ గా ప్రూవ్ అయ్యింది. అయినా కూడా వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.