ఆలూలేదు.. చూలూ లేదు

August 07, 2020

రాజధాని విశాఖేనట!

3 రాజధానుల బిల్లు నేటికీ పెండింగ్‌లోనే!
కార్యాలయాల తరలింపు ఆదేశాలకు హైకోర్టు బ్రేక్‌
అయినా తరలించేందుకు జగన్‌ బృందం తహతహ
వివరణివ్వాలని ధర్మాసనం నిర్దేశం

ఓపక్క అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ నెలల తరబడి జనం ఉద్యమిస్తున్నారు. కరోనా కాలంలోనూ భౌతిక దూరం పాటిస్తూ.. మొక్కవోని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క.. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యవహారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణలో ఉంది. తన అనుమతి లేకుండా అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి వీల్లేదని ఽన్యాయస్థానం తేల్చిచెప్పింది.
 
మధ్యలో ప్రభుత్వం దుందుడుకుతనంతో కర్నూలుకు విజిలెన్స్‌, ఎంక్వైరీ విభాగాలను తరలిస్తూ జీవో జారీచేసింది. హైకోర్టు దీనిని కొట్టిపారేసింది. అప్పుడూ కార్యాలయాల తరలింపు కుదరదని తెగేసిచెప్పింది. అయినా ప్రభుత్వ, వైసీపీ పెద్దలు మాత్రం రాజధాని విశాఖేనని స్పష్టం చేస్తున్నారు. వైసీపీపీ నేత, ఏ-2 విజయసాయిరెడ్డి ఒకడుగు ముందుకేసి కోర్టులకే సవాల్‌ విసురుతున్నారు. రాజధానిని విశాఖకు తరలించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని తేల్చిచెబుతున్నారు.
 
ఇందుకు అనుగుణంగానే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు తరచూ విశాఖ వెళ్లి వస్తున్నారు. తమ కార్యాలయాలు, వసతి కోసం భవనాలను అన్వేషిస్తున్నారు. పంచాయతీరాజ్‌, జలవనరుల శాఖల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ తమ నివాసాలకు, క్యాంపు కార్యాలయాలకు అనువైన భవనాలను గుర్తించినట్లు చెబుతున్నారు. విశాఖ కలెక్టర్‌, నగర కమిషనర్‌లకు లిఖితపూర్వక ఆదేశాలు లేకపోయినా.. వారు యథాశక్తి కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
ఉత్తరాంధ్రకు అనధికార సీఎంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు దరిదాపుగా ఏడు వేల ఎకరాల భూములను గుప్పిట్లో పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి.. భూదాహం తీర్చుకోవడానికి గజపతిరాజుల ఆధ్వర్యంలోని సింహాచల దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టుల ఆస్తులపై కన్నేఽశారు. వాటిని కాజేయడానికి మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును ఆ రెండు బోర్డుల చైర్మన్‌గా తొలగించి.. ఆయన అన్న ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను ఆ పీఠాలను కట్టబెట్టి.. నాటకమాడడం ప్రారంభించారు.
 
చెన్నై నుంచి ప్రైవేట్‌ ఆడిటర్లను పిలిపించి ట్రస్టు ఆస్తులను మదింపు వేయిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన అత్యవసర ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, వాటిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
 
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం సమాధానమిస్తూ... శాసన వ్యవస్థ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, తరలింపునకు సంబంధించి తామెలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు తమ ఉద్యోగులతో జరిపిన చర్చలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. ఆ వివరాలను కౌంటర్‌ అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
 
అంతేగాక ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కూడా ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై అధికారులు ఏవైనా ప్రయత్నాలకు దిగితే అత్యవసర విచారణ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. అలాగే.. రాజధాని పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌, నిబంధనల్లో మార్పులకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 131, పేదలకు ఇళ్ల ఎంపికకు సంబంధించి ఇచ్చిన జీవో 99లపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది.