కొంపముంచిన నిర్లక్ష్యం... భయంలో విశాఖ​

August 14, 2020

​ప్రశాంతమైన నగరం. అందరూ అక్కడికి వెళ్లి అలా బీచ్ లో సేద దీరాలి అనుకుంటారు. కానీ అలాంటి విశాఖకు ఊహించని కష్టం వచ్చింది.  ఈ తెల్లవారుజామున ​విశాఖ శివారులో ​భారీ​ ఘోర విపత్తు సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.​ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు జనం అస్వస్థతకు గురయ్యారు.​  లీకైన వాయువు వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలె​త్తాయి. మనిషి ఆక్సిజన అందకుండా 2 నిమిషాలు కూడా బతకలేడు. అలాంటి మొత్తం ఆక్సిజన్ ను ఆ వాయువు కలుషితం చేసింది. సమస్య అర్థం కాకుండా ప్రజలు మాత్రం ఏం చేయగలరు. వారికి వాయువు లీకైన విషయం తెలిసేలోపు చాలా నష్టం జరిగిపోయింది.

విశాఖ పట్నం గ్యాస్ లీకైన ప్రమాదంలో ​మొత్తం 8 మంది ఇప్పటివరకు మరణించారు. వందల మంది రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీ​శారు. బాధితులను రెస్క్యూ చేయడానికి వచ్చిన పోలీసులు కూడా కొందరు అస్వస్థతకు గురయ్యారు.  ఇళ్లలో ఉంటే బెటరేమో అని  మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

​ఈ వాయువు ఎక్కువగా ​చిన్నారులు, మహిళల​పై ప్రభావం చూపింది. వారందరినీ  ఆసుపత్రికి తరలిస్తున్నారు.​ అస్వస్థతకు గురైన​ వారికి కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే... ఈ వాయువు లీక్ ప్రమాదాన్ని మూడు రోజుల క్రితమే అధికారులకు సమాచారం అందినా వారు దాని ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయినట్టు తెలుస్తోంది. అదింత ఘోర ప్రమాదాన్ని కలిగిస్తుందని వారు ఊహించలేకపోాయారని చెబుతున్నారు. గ్యాస్ వాయువు లీక్ అయిన విశాఖపట్నం లో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.