జగన్ స్కీమ్ - వలంటీర్స్ డెలివరీ బాయ్ లేనా?

August 10, 2020

మంచి ముఖ్యమంత్రి అని ఈరోజు అనిపించుకుందామా? రేపు అనిపించుకుందామా ? అన్నట్టుంది జగన్ స్పీడ్. అన్నీ ఫాస్టుగా కావాలని కోరుకుంటున్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసింది మొదలు టకటకా రోజూ ఏవో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న‌టి తన తొలి మంత్రివ‌ర్గ స‌మావేశంలోనే దాదాపు 20 నిర్ణ‌యాలు తీసుకొని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. దీని ప్ర‌కారం సెప్టెంబ‌రు 1 నుంచి రేష‌న్ షాపుల ద్వారా స‌న్న‌బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు.. ఎవ‌రికి వారు రేష‌న్ షాపుకు వ‌చ్చి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా.. ల‌బ్థిదారుల ఇంటికే డోర్ డెలివ‌రీ చేసేలా కొత్త విధానాన్ని తెర పైకి తీసుకురానున్నారు.
అదే విధంగా ల‌బ్థిదారుల‌కు అందించే బియ్యాన్ని 5..10..15 కేజీల బ్యాగుల్ని త‌యారు చేయిస్తామ‌ని.. వాటిని ఇళ్ల‌కే పంప‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. బియ్యంతోపాటు.. ఐదారు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌నుకూడా అంద‌చేయ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యంతో పెద్ద వ‌య‌స్కులు.. ఒంట‌రి మ‌హిళ‌ల‌తో పాటు.. ప‌లువురికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని రీతిలో రేష‌న్ సామాన్ల‌ను ఇంటికే డోల్ డెలివ‌రీ విధానం కొత్త త‌ర‌హాగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. డోర్ డెలివ‌రీ కోసం గ్రామ‌వ‌లంటీర్ల సేవ‌ల్ని వినియోగించుకోనున్నారు.
ఊర్లో అందరూ ఒకరికి ఒకరు తెలిసిన వారే ఉంటారు. వలంటీర్లు కూడా ఈ డెలివరీ బాయ్ గా చేయడానికి ఆసక్తి చూపుతారా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే ఈ వలంటీర్ ఉద్యోగాలు తెచ్చుకునే వారి కంటే సామాన్యులు ఊళ్లలో ఉంటారు... వారికి మేమెందుకు డెలివరీ చేయాలన్న సమస్యలు కచ్చితంగా వస్తాయి. గవర్నమెంటు రూలే అయినా... దళితవాడలకు వీళ్లు డెలివరి చేస్తారా అన్నదీ సమస్యే. అమలు విషయంలో ఇందులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. మరి వాటిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.