ఓట్ల పండగకు వెళ్లొద్దాం పదండి...

May 31, 2020

రేపే ఓట్ల పండగ. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన పండగ. ఈ పండక్కి ఊళ్లో ఎంత సందడి ఉంటుందో చెప్పలేం. అందుకే, ఎన్ని పనులున్నా సరే... ఎంత దూరంలో ఉన్నా సరే... రెక్కలు కట్టుకునైనా ఊళ్లో వాలిపోవాల్సిందే. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వలస జీవులంతా పొలోమంటూ రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాలలో సొంతూరి దారి పడుతున్నారు. ఇలా ఒకేసారి ఇంతమంది వాహనాలెక్కడంతో దారులన్నీ కిక్కిరిసాయి. ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో చాలాచోట్ల, మరీ ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఒకవైపు మండుటెండలు, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు (ప్లాజాల వద్ద) గంటలతరబడి ఎదురుచూపులు.... ఇక, ఆ ప్రయాణికుల అవస్థలు ఎలా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. ఇన్ని ఇబ్బందులుంటాయని వారికి కూడా తెలుసు. అయినా సరే... ఓట్ల పండక్కి వెళ్లాల్సిందేనన్న పట్టుదలతో బయల్దేరారు.

టోల్ ప్లాజా ఒక్కోసారి సాధారణ రోజుల్లోనే రద్దీ కనిపిస్తుంది. వాహనాలను త్వర త్వరగా పంపించేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎంత లేదన్నా ఒక్కో వాహనానికి కనీసంగా 10 సెకండ్లయినా పడుతుంది. ఈ లెక్కన లెక్కేసుకోండి. ఒకేసారి ఒక గేటులో 50 వాహనాలు వచ్చాయనుకుందాం. చివరి వాహనాన్ని పంపేందుకు తక్కువలో తక్కువగా పది నిముషాలు పడుతుంది. ఒకేసారి ఇలా ఆగకుండా వాహనాలు రావడంతో టోల్ ప్లాజా సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికిగానీ, ప్రశాంతంగా గ్లాసుడు మంచినీళ్లో, కప్పు కాఫీనో తాగడానికి కూడా వీలు చిక్కడం లేదు. ‘‘ఎంతసేపయ్యా...? త్వరగా ఇవ్వలేవా...?’’ అని, ఆ సిబ్బందిని వాహన చోదకులు ప్రతి ఒక్కరూ విసుక్కుంటారు, కసురుకుంటారు. కానీ, ఆ సిబ్బంది ఒత్తడిని, పరిస్థితిని ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు.

వాహనాల రద్దీ పెరగడంతో టోల్ ప్లాజా సిబ్బందితో, నిర్వాహకులతో వాహన చోదకులు అక్కడక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. టోల్ వసూలు చేయొద్దంటూ గొడవపడుతున్నారు. కొందరైతే... గేట్లను ధ్వంసం చేసి, టోల్ ఫీజ్ చెల్లించకుండానే వెళుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. అసలే ఇది ఎన్నికల తరుణం. పోలీసులు వారి పనులతో వారు సతమతమవుతున్నారు. అది చాలదన్నట్టుగా, ఈ టోల్ ప్లాజాల వద్ద ఈ గొడవలొకటి. ఇవన్నీ మనోళ్లకు (ఎన్నికల పండక్కి వెళుతున్న ఓటర్లకు) అనవసరం. ‘‘మన పని మనకు ముఖ్యం. టోలోడితో, పోలీసోడితో మనకేంటి..?!’’ అనుకుంటున్నారు. ఇది సరైనదేనంటారా... ??!!