జగన్ అభిమాని బిల్డింగు కూల్చేశారు

October 17, 2019

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్... ఇద్దరివీ భిన్న రంగాలైనా ఒకే తాను పక్షులే. ఎందుకంటే జగన్ ఫ్యామిలీతో వినాయక్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే... వినాయక్ కే కాకుండా మొత్తం ఆయన ఫ్యామిలీకి వల్లమాలిన అభిమానం ఉంది. వినాయక్ తండ్రికి అయితే వైఎస్ గురువు కిందే లెక్క అంట. అసలు జగన్ పార్టీ తరఫున తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వాడినంటూ కూడా వినాయక్ చెప్పారు. ఈ విషయాలను వినాయకే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు.

సరే... ఇది పాత కథే అయినా... తన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వినాయక్ కు నష్టం కలిగేలా జగన్ ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? నిజమే తీసుకోరు గానీ... విధి అలా జరిగిపోయింది అంతే. సరే అసలు విషయంలోకి వస్తే.. అమరావతి పరిధిలో కృష్ణా కరకట్టపై చంద్రబాబు హయాంలో కట్టిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్... దానిని ఒక్క మాటతో కూల్చివేయించారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రజా వేదిక కూలిపోతున్న వేళే.... తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వినాయక్ కు చెందిన నాలుగు అంతస్థుల భవంతిని అక్కడి అధికారులు కూల్చి పారేశారు.

ప్రజా వేదిక కూల్చివేతకు, వినాయక్ ఇంటి కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదు గానీ.. జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రజా వేదిక కూలిన సమయంలోనే ఆయనను ఆరాధించే వినాయక్ ఇల్లు కూడా కూల్చివేతకు గురి కావడం నిజంగా ఆసక్తి రేకెత్తించేదే కదా. వినాయక్ ఇల్లు కూల్చివేత విషయానికి వస్తే... హైదరాబాద్ శివారు ప్రాంతమైన వట్టినాగులపల్లిలో వినాయక్ కొంతకాలంగా నాలుగు అంతస్తుల భవంతి నిర్మిస్తున్నారట. అయితే దీనికి సరైన అనుమతులు లేవంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారట. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం ఉందంటూ నోటీసుల్లో తెలిపారట. అయితే వినాయక్ నుంచి ఈ నోటీసులకు స్పందన లేకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భవనాన్ని కూల్చివేశారట.