వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే - కొట్టుకోవడమే లేటు

May 29, 2020

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చే రెండు నెలలు కూడా కాకుండానే అప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు మొదలయ్యాయి. కీలకమైన గుంటూరు జిల్లాలో రెండు.. మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడుదల ర‌జ‌నీ వ‌ర్సెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు రాజశేఖర్ ను తప్పించి జగన్ ర‌జ‌నీకి సీటు ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన‌ తర్వాత ర‌జ‌నీ రాజశేఖర్ ను పూర్తిగా పక్కన పెట్టేశార‌న్న ప్రచారం వైసిపి వర్గాల్లో నడుస్తోంది.
రాజశేఖర్ సైతం ర‌జ‌నీ తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంత నియోజకవర్గం అయిన తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్సెస్ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ సొంత నియోజకవర్గం తాడికొండ. ఈ క్రమంలోనే సురేష్ తన నియోజకవర్గంలోని విషయాల్లో అనవసరంగా కలుగ‌ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి కొద్దిరోజులుగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.
చివరకు ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో సైతం ఈ ఇద్దరు నేతల మధ్య గొడవలు ప్రారంభమయ్యి.... కొట్టుకుని... కేసులు పెట్టుకుని వరకు వెళ్ళింది. వాస్తవంగా తాడికొండ అసెంబ్లీ సీటుకు బాపట్ల లోక్‌స‌భ సీటుకు సంబంధం లేదు. తాడికొండ గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌స్తుంది. అయితే గ‌త ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణంలో జ‌గ‌న్ నందిగం సురేష్‌కు బాప‌ట్ల లోక్‌స‌భ సీటు ఇవ్వ‌గా ఆయ‌న విజ‌యం సాధించారు. అయితే సురేష్‌కు స్థానికంగా అనుచ‌ర‌గ‌ణం ఉన్న నేప‌థ్యంలో... ఆయ‌న ఇప్పుడు ఇక్క‌డ హ‌డావిడి చేయ‌డం స్టార్ట్ చేశారు.
ఈ జోక్యం మితిమీరుతుండ‌డంతో శ్రీదేవి చివ‌ర‌కు నేరుగా జ‌గ‌న్‌ను క‌లిసి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. అలాగే తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని చోట్ల సురేష్ ప్రోత్సాహంతోనే ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని... దీనివ‌ల్ల త‌న‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని కూడా శ్రీదేవి ఆరోపించార‌ట‌. ఇదిలా ఉంటే ఈ వివాదాన్ని పరిష్క‌రించే బాధ్య‌త‌ను జ‌గ‌న్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారని సమాచారం. పార్టీకి చెడ్డ‌పేరు తీసుకు వ‌స్తే ఎలాంటి వారిని అయినా తాను ఉపేక్షించ‌న‌ని కూడా చెప్పార‌ట‌.