హైదరాబాద్‌లో ఇరాన్, అమెరికా యుద్ధం మంటలు

January 25, 2020

ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధవాతావరణం హైదరాబాద్‌లోనూ మంటలు రేపింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఇతర పౌరులు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ట్విటర్ వేదికగా దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు ఇటీవల దిశ ఎన్‌కౌంటర్ ప్రస్తావన తెచ్చి సంచలన కామెంట్లు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. 'హైదరాబాద్‌లోని అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జిహాదీల సానుభూతి పరులు పనిచేస్తున్నారా? అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి అప్రమత్తమయ్యారా? సోదాలు జరుపుతున్నారా? లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారా?' అంటూ మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సిల్‌‌లను ట్యాగ్ చేసి ప్రశ్నించారు. దీనిపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సమాధానం వచ్చింది. 'అవును సర్... ఇటువంటి వాటిపై నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి, జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు ప్రత్యేక శాఖలు ఉన్నాయి. మా బృందాలు 24X7 గంటలు పనిచేస్తాయి. మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాకు సమాచారం అందిస్తూనే ఉండండి' అని అందులో సైబరాబాద్ సీపీ ట్విట్టర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు.
ఆ తరువాత అందులోకి అసదుద్దీన్ ఎంటరయ్యారు. 'అవును సర్ అంటూ హైదరాబాద్‌ సీపీ సర్ రిప్లై ఇస్తున్నారు. అటువంటి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారు? దయచేసి చెబుతారా? లేదంటే అసలు మీ ఉద్దేశం ఏంటనే దానిపై కాస్త స్పష్టతనిస్తారా? మీరు భక్తులకే సమాధానం చెబుతారా? లేదంటే నాలాంటి ఎంపీకి కూడా చెబుతారా?' అని ప్రశ్నించారు.   'సీపీ సర్, మీరు ఏమైనా చేసుకోండి.. కానీ, ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ల పేరుతో మాత్రం చంపకండి. వీలైతే అరెస్టు చేయండి.. థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించొచ్చు. సీపీ సర్, ఉగ్రవాదానికి మతం లేదు' అని మరో ట్వీట్‌లో అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

Read Also

మోడీ దొరికాడు... జగన్ బాబుని వదిలేస్తాడా
జగన్ కి బ్రేక్ పడింది
సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్