వరంగల్ చైల్డ్ రేప్ - ఊరిశిక్ష వేసిన కోర్టు !!

May 26, 2020

తొమ్మిది నెలల పాపను అత్యాచారం చేసిన కామపిశాచికి తగిన శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ దారుణంపై కోర్టు రికార్డు స్థాయిలో తన విచారణను పూర్తి చేసి నిందితుడికి శిక్ష విధిస్తూ తాజాగా తీర్పును ఇచ్చింది.పొత్తిళ్లలో పడుకున్న పసిగుడ్డును తీసుకెళ్లి తమ కామవాంఛ తీర్చుకున్న ప్రవీణ్ కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జయకుమార్ తీర్పు వెల్లడించారు.
పాపం పుణ్యం తెలీని తొమ్మిది నెలల పసిగుడ్డ తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్న వేళ.. మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్.. ఆ చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. దీనికి సంబంధించిన కేసు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ కేసుకు సంబందించిన విచారణ జులై 24న ప్రారంభమైంది. ఇరు పక్షాల వాదనల్ని విన్న కోర్టు.. విచారణను ఈ నెల 2న ముగించి.. తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు.
సంచలనంగా మారిన ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు రికార్డు సమయంలో తమ విచారణను పూర్తి చేశారు. 20 రోజుల వ్యవధిలోనే నేరారోపణ పత్రాన్నికోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షులు అవసరం ఉండగా 30 మందిని కోర్టులో హాజరుపరిచారు. ప్రవీణ్ ను దోషిగా నిర్దారించిన కోర్టు అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఈ కేసు విచారణ సమయంలో తాను మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రవీణ్ ఒప్పుకున్నట్లుగా అతడి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. నేరం జరిగిన 53 రోజుల్లో తీర్పు వెల్లడించటం ఒక చారిత్రాత్మక ఘట్టంగా పలువురు అభివర్ణిస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును.. అంతే వేగంగా దోషికి శిక్ష అమలు చేస్తే.. మరింత న్యాయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.