మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది

July 15, 2019
CTYPE html>
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర‌మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరారు. కర్నూలులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయ‌న‌కు ప‌సుపు కండువా క‌ప్పారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ, కర్నూలు జిల్లా రాజకీయాలు కోట్ల, కేఈ కుటుంబాల మధ్యే తిరిగాయని.. ఈ రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్రేనని అన్నారు. తానూ, కేఈ, సూర్యప్రకాష్‌రెడ్డి ముగ్గురం రాయలసీమ బిడ్డలమేని.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన చెప్పారు.
 
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్‌కు ఎంతో సన్నిహితంగా ఉండేవారని.. తాను కూడా విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ వచ్చేందుకు కృషి చేస్తానని.. కోడుమూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిస్తానని బాబు హామీ ఇచ్చారు. 'ఎల్‌ఎల్‌సీని కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తాం. ఒకే రోజు రూ.8,100 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చాం. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీరు తీసుకొచ్చాం. రాయలసీమ చరిత్రలో తొలిసారి 214 టీఎంసీల నీరు ఇచ్చాం' అని బాబు చెప్పారు. 
 
ఆదాయం రాని రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించిందని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. వాల్తేరు డివిజన్ లేకుండా చేశారని.. నిలదీస్తే దాడి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడనని స్పష్టం చేశారు. 'నేను భయపడతానో లేదో మహానాయకుడు సినిమా చూస్తే మోడీకి తెలుస్తుంది. నేనంటే ఏంటో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది' అని అన్నారు. .24 కేసులు వేసినా తాను భయపడలేదని.. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు.  'ఏపీలో కోడి కత్తి పార్టీ ఉంది. విశాఖ జోన్ గురించి, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆ పార్టీ మాట్లాడదు. కేంద్రాన్ని ఎందుకు నిలదీయదు?' అని బాబు సూటిగా ప్ర‌శ్నించారు.