గ‌త ఆరేళ్ల‌లో అలా జ‌ర‌గ‌లేదంటోన్న కేటీఆర్!

June 03, 2020

ఫ్లోరైడ్‌....ఈ పేరు విన‌గానే న‌ల్లగొండ జిల్లా వాసులు నిద్ర‌లో ఉన్నా ఉలిక్కిప‌డ‌తారు. ఫ్లోరైడ్ అనే ప‌దంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉన్న చేదు అనుబంధం అటువంటిది. జిల్లాలో లక్షలాది మందిని పట్టి పీడించిన ఈ మ‌హమ్మారిని ఎదుర్కొనేందుకు జిల్లా వాసులు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. పోరాటాలు...ఉద్య‌మాలు..నిర‌స‌న‌లు....విజ్ఞ‌ప్తులు....విన‌తులు....ఇలా ఎన్ని చేసినా ఫ్లోరైడ్ భూతం నుంచి ప్ర‌జ‌లు విముక్తి పొంద‌లేక‌పోయారు. 10 లక్షల మంది వరకు జనాభా ఈ ఫ్లోరైడ్‌ మహమ్మరిన బారిన పడిన వారే.  పాత నల్లగొండ జిల్లాలోని ప్రతి ముగ్గురి జనాభాలో ఒకరు ఫ్లోరైడ్ బాధితులేనంటే ఆశ్య‌ర్యం వేయ‌క‌మాన‌దు.
ప్రతి పది మందిలో ఒకరికి ఫ్లోరోసిస్‌ కారణంగా ఆరోగ్య సమస్యలున్నాయి. ఇటువంటి నేప‌థ్యంలో 2014లొ తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప‌గ్గాలు చేప‌ట్టారు. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ప్ర‌తి ఇంటికి మంచినీరు అందించేందుకు బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. ఆరేళ్ల‌పాటు ప్ర‌భుత్వం, అధికారులు, జిల్లా యంత్రాంగం చేసిన కృషి స‌త్ఫ‌లితాల‌నిచ్చింది. గ‌డ‌చిన ఆరేళ్ల‌లో న‌ల్ల‌గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు న‌మోదు కాక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా, ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన క‌థ‌నాన్ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
ఫ్లోరైడ్ బాధితులపై ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన క‌థ‌నాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఆ వార్త చ‌దివి తానెంతో గర్వంగానూ, సంతోషంగానూ ఫీల్ అయ్యాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. "గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథలో భాగంగా అందరు ఇంజనీర్లు, అధికారులు నల్గొండ తదితర జిల్లాల్లో ఎంతో శ్రమించారు`` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. "గడచిన ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు" అంటూ ఓ ఆంగ్ల దినపత్రిక రాసిన క‌థ‌నాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. భ‌విష్య‌త్తులో మిష‌న్ భ‌గీరథ వ‌ల్ల మ‌రిన్ని స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌ని కేటీఆర్ ఆకాంక్షించారు. మిష‌న్ భ‌గీరథతో ఆ మ‌హమ్మారికి చెక్ పెట్టేసిన‌ట్లేన‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.