“వేట” ఆధ్వర్యంలో డాలస్ లో దిగ్విజయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

June 06, 2020

మహిళా సాధికారతకు గట్టిపునాదులు వేసిన వుమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్

మహిళల సమతుల్య జీవనానికి, మరియు  వారికి అవసరమైన సాధికారతకు కావలసిన ప్రోత్సాహం, శిక్షణ  మరియు  ప్రేరణ అందించడానికి  అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న ప్రముఖ ప్రవాస భారతీయులు శ్రీమతి ఝాన్సి రెడ్డిగారు వుమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేట) జాతీయ తెలుగు సంస్థను సెప్టెంబరు 2019 లో స్థాపించారు. ప్రాంతాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైన,  లాభాపేక్షలేని ఈ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ మహానగర ప్రాంతంలోని ఫోర్ పాయింట్స్ -కపెల్ లో ఆదివారం మధ్యాహ్నం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) పూర్వాధ్యక్షులు కృష్ణవేణి రెడ్డి శీలం ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.

అతి పెద్ద వేదిక, సభ నిండా జనం ..వేట కార్యక్రమాలకు అద్భుతమైన శుభారంభం

అంతర్జాతీయ మహిళాదినోత్సవ ప్రాముఖ్యతను తమ  స్వాగాతోపన్యాసంలో వివరిస్తూ  ఆటా మరియు టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. సంధ్య గవ్వ “మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ వికాసం అవసరమని అన్నారు. “మనందరికీ ఎన్నో పనులు చేయగల సామర్ధ్యం, అనుకున్నది సాధించాలనే బలమైన కోరిక ఉన్నాయి, కావున ముందు మనల్ని మనం అవమానించు కోకూడదు” అన్నారు. 

ఈనాటి కార్యక్రమ వ్యాఖ్యాత, సంచాలకులు అను బెనకట్టి దాదాపు ఐదు వందలమందికి పైగా హాజరైన సభకు అభివందనం చేసారు. డాలాస్ లో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వేట సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఝాన్సి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఉద్దేశ్యాలను, ప్రణాళికల దృశ్య మాలికను ప్రసారం చేసారు. “ఝాన్సి రెడ్డి గారు సేవకు ఒక కొత్త నిర్వచనమని, అనాదిగా మహిళలకు అన్యాయం జరుగుతుందని, అందుకే మహిళా సాధికారత ద్వారా కావలసిన బోధన, ప్రేరణ వేట సంస్థ అందిస్తుందని అభివర్ణించారు.  

వేట సంస్థ అధ్యక్షులు ఝాన్సి రెడ్డి మహిళలందరికీ మరియు అన్నీ జాతీయ స్థానిక తెలుగు సంస్థలకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. వేట ఏ సంస్థకూ పోటీ కాదని, ఇది మహిళా సాధికారత కోసం స్థాపించిన సంస్థ అని, ఆధునిక మహిళల జీవితంలో నిత్యం ప్రతిబింబిస్తున్న బహుమఖ ప్రజ్ఞలు ఈ సంస్థ చిహ్నం (Logo) ద్వారా సుస్పష్టంగా తెలుస్తున్నాయని, ప్రపంచంలో ఎక్కడున్నా మనం అందరం ఒకటై అవసరమైన ప్రేరణ, శిక్షణ అందించి మహిళలకు స్వయం ప్రతిపత్తిని  కలిగించాలని సూచించారు.   

 “పవర్ ఆఫ్ వుమెన్” చర్చకు ఐదుగురు మహిళామణులు సిద్ధం

విచ్చేసిన మహిళా అతిథులందరినీ “పవర్ ఆఫ్ వుమెన్” అన్న అంశం మీద చర్చకు  నేటి సంచాలకులు అను బెనకట్టి వేదిక మీదకు ఆహ్వానించారు.  ఇటీవల విడుదలైన “అలా మొదలైంది”, “ఓ బేబీ”, “కళ్యాణ వైభోగం” సినిమాలతో సంచలనం సృష్టించిన మహిళా దర్శకులు నందిని రెడ్డి మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన వేట సంస్థకు కృతజ్ఞతలు తెలియ జేశారు. తెలియని అపరిచుతులు మనదగ్గరకు వచ్చి “మీ సినిమా నా జీవితాన్ని మార్చింది” అన్నప్పుడు అంతకంటే ఆనందం, విజయం ఇంకొకటి ఉండదు అని నా అభిప్రాయం”. భోజన ప్రియులైన నందినిరెడ్డికి చిన్నతనం నుండి ఈత కొట్టడం, పర్యావరణ పరిరక్షణ అంశాలమీద మక్కువ ఎక్కువ. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. క్రికెట్ ఆట అంటే ప్రాణం అని, అన్య సంస్కృతుల గురించి తెలుసుకోవడం, ప్రయాణాలు చెయ్యడం ఇష్టం అని నందిని రెడ్డి తెలియ జేశారు

మహిళలు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి కావలసిన అవగాహన పెంచుకొని ఎన్నికల వ్యవస్థలో భాగస్వామ్యులు కావాలని ప్రముఖ టెక్సస్ న్యాయవాది, USICOC అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహాత్మాగాంధి నోటినుండి జాలువారిన “ఇతరులలో నువ్వు చూడదలచిన మార్పుకోసం ప్రయత్నించు” సూక్తిని ఉదహరిస్తూ, మన నిత్య జీవితాలను ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేయగలరని, అందుకే అడుగు అడుగునా ఎన్నికల సమయంలో మీ వంతు కృషి చెయ్యాలని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ “ ఉద్యోగరీత్యా లింగభేదం లేకుండా కావలసిన సలహాలను తీసుకోవాలని సూచించారు. 

అమెరికాలో ఉన్ననల్ల జాతీయులలో డాలస్ కౌంటీకి చెందిన షెరీఫ్ మెరియన్ బ్రౌన్ అతి తక్కువ మందిలో ఒకరు.  రాజకీయాలలోకి ప్రవేశించడం తన జీవితంలో చాల కష్టమైన నిర్ణయమని, ఎప్పుడూ బలంగా, దృడంగా, అప్రమత్తంగా ఉంటూ  ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చని అన్నారు. “నా నిర్ణయాల ఫలితాలను నేను స్వీకరించాను, అనుభవిస్తున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను” అంటూ అందరినీ ఆకట్టుకున్నారు.   

ఆపి (AAPI) ఉపాధ్యక్షులు, ప్రముఖ పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్  డా. అనుపమ గోటిముకుల తన చిన్నతనంలో మెడికల్ కాలేజ్ ప్రవేశా పరీక్షలో ఉత్తీర్ణతకు ఎంత కష్టపడ వలసి వచ్చిందో వివరిస్తూ “తెలియని అంశాల వలన కలిగే భయం పోగొట్టుకోవడం విజయానికి శ్రేయస్కరం” అన్నారు. “మీలో దాగి ఉన్న నాయకులను గుర్తించి ధైర్యంగా అవసరమైన ప్రణాళికతో ముందుకు పోవాలి” అని సలహా ఇచ్చారు. చిన్న పిల్లలతో పనిచేస్తూ నిత్యం తమ వృత్తిలో ఎంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులతో మెలగ వలసి వస్తుందని, అది కొంచం కష్టంగా ఉన్నప్పటికీ తగినంత అప్రమత్తత ఉంటే సరిపోతుందని అన్నారు.    

అలనాటి బాలీవుడ్ తార మీనాక్షి శేషాద్రి తమ జీవిత అనుభవాలను పంచుకుంటూ, 1981 లో మిస్ ఇండియా కైవసం చేసుకొని, పదిహేను సంవత్సరాల వ్యవధిలో ఎనభై సినిమాల్లో  నటించి, వివాహం ద్వారా అమెరికాలో ఆడుగుపెట్టిన ఆమెకు కొంచం కష్టంగానే ఉండేది. మహిళ తన బహుముఖ ప్రజ్ఞల ద్వారా వేసిన పునాది ఎన్నో కుటుంబాలకు, సంబంధ బాంధవ్యాలకు ఒక మూల స్థంభం కాగలదని, మరియు సినిమాలకు ముందు తనకు ఇష్టమైన నృత్యం గురించి గుర్తుచేసుకొన్నారు. ఓపిక జీవితంలో చాలా అవసరమైన ఆయుధమని, మాతృత్వం మనుగడకు ఇది ప్రధానం అని మీనాక్షి  శేషాద్రి అన్నారు.   

ఐదు గంటల పాటు అందరినీ అలరించిన సాంస్క్రతిక కార్యక్రమాలు

తీప్తి నీరజ నేడూరి  సమర్పించిన ‘పుష్పాంజలి శాస్త్రీయ నృత్యం, కూచిపూడి కళాక్షేత్ర అధినేత్రి పద్మశొంఠి దర్సకత్వంలో అందించిన “తిరు తిరు జవరాల” అనే జానపద శాస్త్రీయ నృత్యం, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య దర్శకులు స్వప్న గుడిమెట్ల అందించిన “అలిగిరి నందిని శాస్త్రీయ మిశ్రమ నృత్యం, సాయి నృత్య అకాడెమీ డిఎఫ్ డబ్ల్యు నుండి శ్రీదేవి యడ్లపాటి దర్శకత్వంలో అందించిన “లార్డ్ శివ” శాస్త్రీయ నృత్యం, కీర్తి చంకూర పాడిన మహిళా దేశభక్తి గేయం, వీణ యలమంచిలి, పూజిత కడ్మి శెట్టి, ప్రభాకర కోట, పాడిన “మధుర గీతాలు” ఝాన్సి చంకూర సమర్పించిన “మూవీ మెడ్లీ సాంగ్స్”, తీప్తి నీరజ నేడూరి దర్సకత్వంలో అందించిన “అల వైకుంఠపురం పాటలు” సుధారెడ్డి సమర్పించిన “మూవీ సాంగ్స్ ఫ్రం ఓ బేబీ” అందరినీ ఆకట్టుకొన్నాయి.

శాంతి నూతి నేతృత్వంలో నిర్వహించిన “ టాలీవుడ్: తారలు దిగి వచ్చిన వేళ”, నహీద్ రాహుల్ దుస్తులతో, లెచిక్ బొటిక్   సహకారంతో మీనాక్షి శేషాద్రితో కలిపి అందమైన వస్త్రాభరణాలతో అత్యంత సుందరంగా ప్రదర్శించిన “ఫ్యాషన్ షో” కార్యక్రమాలు ప్రేక్షకులకు వీనుల విందు అని చెప్పుకోవచ్చు.

విచ్చేసిన అతిథుల మరియు కార్యక్రమ సేవకుల సన్మానం...కలిసి ఉంటె కలదు సుఖం

సమన్వయకర్త  కృష్ణవేణి రెడ్డి శీలం విచ్చేసిన అతిథులైన నందిని రెడ్డి, నీల్ గోనుగుంట్ల, షెరీఫ్ మేరియన్ బ్రౌన్, మీనాక్షి శేషాద్రి, డా. అనుపమ గోటిముకులకు సంప్రదాయ బద్ధంగా పుష్పగుచ్చాలు, దుశ్శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమం విజయం వెనుక వందల గంటలు శ్రమించిన సేవకులు అను బెనకట్టి, లక్ష్మి పాలేటి, ఇందు మందాడి, సురేష్ పఠానేని, మల్లిక్ రెడ్డి కొండ, అభితేజ రెడ్ది, ప్రసన్న దొంగూర్, శ్రీలక్ష్మి మండిగ, కల్పన గనపురం, మాధవి రెడ్డి, లతా గద్దె, వాణి ద్రోణవల్లి, రాధా బండార్ లని గుర్తించి సత్కరించారు.

వేదికపై ప్రముఖ మహిళా నాయకుల గుర్తింపు మరియు “మహిళ-2020” సంచిక ఆవిష్కరణ

సమన్వయకర్త  కృష్ణవేణి రెడ్డి శీలం ప్రముఖ మహిళా సేవకులు, నాయకులైన డా. సంధ్య గవ్వ, డా. కస్తూరి ఇనగంటి, డా. కిరణ్ కంచెర్ల, డా. శ్రీదేవి జువ్వాడి, డా. సుధా రెడ్డి, ఇందు మందాడి, గీతా దమ్మన్న వేదిక మీదకు ఆహ్వానించి అందరి సమక్షంలో మహిళ-2020 ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.

ఇటీవలే డాలస్ మహానగర ప్రాంతంలో క్యాన్సర్ బారినుండి పునర్జన్మ పొందిన ఒక బాలుడికి బోన్ మ్యారో అందించిన స్థానిక తెలుగు వైద్యులు డా. ప్రశాంతి గణేశను అభినందించారు. ఎవరైనా 18 నుండి 44 వయసు లోపు వారు బోన్ మ్యారో అందించడానికి అర్హులని, బంధుత్వం ద్వారా కేవలం ముప్పై శాతం మాత్రమె సాధ్యమని, మిగతా డెబ్బై శాతం బోన్ మ్యారో బ్యాంక్ కు నుండి పొందవలసినదేనని డా. గణేశ పిలుపు నిచ్చారు. ‘సేవ ఎ లైఫ్’ అనే నినాదంతో అమెరికా లోని  దాదాపు నలభై నగరాలలో ‘బి ద మ్యాచ్’ కార్యక్రమాలకు కావలసిన సహకారం అందిస్తున్న చిన్ని వెంకటేశ్వర మాట్లాడుతూ ‘అందరం తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.   

ఎందరో మహానుభావులు...అందరికీ వందనాలు!

చక్కని ఆడియో, వీడియో, లైటింగ్ అందించిన ఫుల్ హౌస్ మీడియా నుండి సురేష్ పఠానేనికి , సభాప్రాంగణాన్ని, వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించిన లిటిల్ జెమ్స్ నుండి ప్రత్యూషకు,  ఫోర్ పాయింట్స్ షెరటాన్ కు చెందిన సారా, మరియు అరుణ్ విట్టలకు, జాతీయ/ప్రాంతీయ తెలుగు సంస్థలైన ఆటా, నాటా, నాట్స్, డాటా, దారా, ఐఏయెన్టి, టాంటెక్స్ అను బెనకట్టి కృతజ్ఞతలు తెలియజేసారు