ఎలక్షన్ కమిషనర్‌ను తిట్టిపోసిన జగన్ ఇప్పుడేమంటాడు?

May 31, 2020

కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర రీతిలో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని వారం కిందట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదేశాలు జారీ చేస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలా తిట్టిపోశారో.. ఎంత తీవ్రమైన ఆరోపణలు చేశారో తెలిసిందే. కరోనా వైరస్ గురించి జనాల్ని హెచ్చిరిస్తూ జాగృతం చేయాల్సిన ముఖ్యమంత్రే అది ఏమాత్రం ప్రమాదకరం కాదన్న రీతిలో మాట్లాడారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చనిపోతుంటే.. దాని వల్ల చనిపోవడం అన్నదే ఉండదని తేల్చాడు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది.. బ్లీచింగ్ పౌడర్ వేస్తే వైరస్ చచ్చిపోతుంది అంటూ తేలికైన కామెంట్లు చేశారు. ఎన్నికల కమిషనర్‌కు కులం ఆపాదించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక విజయసాయిరెడ్డి, తమ్మినేని సీతారాంల వ్యాఖ్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
సీఎం మాటల్ని పట్టుకుని వైకాపా నాయకులు, కార్యకర్తలు, మద్దతు దారులు మరింత రెచ్చిపోయారు. నిమ్మగడ్డ రమేష్ మీద విరుచుకుపడ్డారు. ఆయన చేసింది తప్పన్నట్లు మాట్లాడారు. కట్ చేస్తే వారం తర్వాత ఇప్పుడు కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతోందో అందరూ చూస్తున్నారు. జగన్ సర్కారే జనతా కర్ఫ్యూకు మద్దతుగా అన్నీ బంద్ చేసింది. జనాలు ఇళ్లలోంచి బయటికి రావద్దంటోంది. ఎన్నికల కమిషనర్ వాయిదా వేయకుంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతుండాల్సింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కోసం ఏపీ జనాలంతా బయటికి వస్తే పరిస్థితి ఏంటి? దేశమంతా కర్ఫ్యూ పాటిస్తున్న సమయంలో ఏపీ జనాలు ఇలా బయట ఉంటే ఇతర రాష్ట్రాల వాళ్లు ఎలా తిట్టేవాళ్లు? వాళ్ల విమర్శలు తర్వాత కరోనా ప్రభావం ఎలా విస్తరించి ఉండేది? దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం నూటికి నూరు శాతం కరెక్ట్ అన్నమాటే కదా? ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంది. కానీ అంగీకరించదు. కొంతమంది వైకాపా నాయకులు ఇప్పటికీ నిమ్మగడ్డ రమేష్ మీద విమర్శలు చేస్తుండటం గమనార్హం. 

ఇదంతా ఒకెత్తు అయితే... ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేయకున్నా కూడా కోర్టే వాయిదా వేసుండేది. ఎందుకంటే పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి.