ఆర్టికల్ 35ఏలో ఏముంది? దాన్ని ఎందుకు రద్దు చేశారు?

August 03, 2020

ఆర్టికల్ 370.. 35ఏ లను రద్దు చేస్తామన్నంతనే కశ్మీర్ (జమ్ము ప్రాంతానికి చెందిన వారు కాదు సుమా) ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నేతలంతా తీవ్ర ఆందోళనను.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత దేశం మొత్తంలో ఉన్న రాజ్యాలకు బ్రిటీష్ సర్కారు స్వేచ్ఛను ఇచ్చేశాయి. దీంతో.. అన్ని సంస్థానాలు విలీనమైన దేశంలో కలిసేందుకు ఓకే చెప్పేశాయి. ఇందులో రెండు సంస్థానాలు (కొన్ని సంస్థనాలు ఉన్నప్పటికి.. అక్కడి ప్రజలంతా భారతదేశంలో భాగం కావాలని భావించిన నేపథ్యంలో.. ఆయా రాజులకు నయానో భయానో ఒప్పించి దేశంలో భాగస్వామ్యం అయ్యేలా చేశారు) మాత్రం దేశంలో కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. అందులో ఒకటి దేశ సరిహద్దులో ఉన్న జమ్ముకశ్మీర్ ప్రాంతం.. మరొకటి దేశం దిగువన ఉన్న హైదరాబాద్ సంస్థానం. అయితే.. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో భాగం చేయటానికి సైనిక చర్యను చేపట్టటం.. తర్వాత దేశంలో భాగస్వామ్యం కావటం తెలిసిందే. హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఇక్కడి పాలకులు భారత్ లో విలీనం కావటానికి ఆసక్తి చూపించకుంటే.. ప్రజలు మాత్రం భారత్ లో కలిసి పోవాలని బలంగా కోరుకున్నారు. దీనికితోడు సర్దార్ పటేల్ రాజకీయ చతురతతో పాటు.. సైనిక చర్య విషయంలో ఆయన అనుసరించిన వైఖరితో ఎలాంటి పంచాయితీలు లేకుండా భారత్ లో విజయవంతంగా విలీనమైంది.
ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్ విషయానికి వస్తే.. ఈ సంస్థానానికి రాజైన హిందు రాజు భారత్ లో ఆ ప్రాంతాన్ని కలవాలని ఆసక్తి చూపిస్తే.. అక్కడి ప్రజల్లో కొందరు పాకిస్థాన్ లో కలవాలని.. మరికొందరు స్వతంత్రంగా ఉండాలని భావించారు. చివరికు నెహ్రూ దౌత్యంతో జమ్ముకశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ భారత్ లో విలీనమైంది. ఈ మాటకు తగ్గట్లే ఆర్టికల్ 370ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్రం కీలకమైన రక్షణ.. ఆర్థిక లాంటి వ్యవహారాల్లో తప్పించి.. మిగిలిన వాటిల్లో కశ్మీర్ కు సంబంధం లేని రీతిలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.
దీనికి కొనసాగింపుగా ఆర్టికల్ 35ఏ ను తీసుకొచ్చారు. ఈ తీర్మానాన్ని చూస్తే.. జమ్ముకశ్మీర్ లో శాశ్వత నివాసి ఎవరన్న విషయాన్ని ఈ అర్టికల్ నిర్వచిస్తుంది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్ పరజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం 1954 మే 14 కంటే ముందు లేదంటే.. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి.. లేదంటే.. అప్పటికే ఆ రాష్ట్రంలో పదేళ్లుగా నివసిస్తున్న వ్యక్తి మాత్రమే కశ్మీర్ శాశ్విత నివాసిగా గుర్తింపు పొందుతారు. తాజాగా రాజ్యసభలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన బిల్లు.. రాష్ట్రపతి కోవింద్ యుద్ద ప్రాతిపదికన జారీ చేసిన ఆర్డర్ కారణంగా ఆర్టికల్ 370.. 35 ఏలు రద్దు అయ్యాయి.